హైదరాబాద్ నుంచి ఈ రెండు ప్రాంతాలకు 4 లైన్ల రోడ్లు.. DPR ప్రక్రియ వేగవంతం చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్-మన్నెగూడ, హైదరాబాద్-కల్వకుర్తి రహదారులను నాలుగు లైన్ల రహదారులుగా తీర్చిదిద్దాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ ఛైర్మన్ సంతోష్ యాదవ్‌తో భేటీ అయి.. ప్రతిపాదనలపై చర్చించారు. ఈ రహదారుల నిర్మాణానికి త్వరగా డీపీఆర్ సిద్ధం చేయాలని కోరారు.
తెలంగాణలో రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం సహకారంతో రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో తాను భేటీ అయినట్లు చెప్పారు.
తెలంగాణలో హైవేల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరామన్నారు. ప్రధానంగా బీవోటీ కన్సెషనరీ జీఎంఆర్ సంస్థ వివాదం పరిష్కరం కోసం ఎదురుచూడకుండా హైదరాబాద్ – విజయవాడ NH-65 రోడ్డు నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించాలని కోరారు.
వాహనాల రద్దీ కారణంగా ప్రమాదాల్లో చనిపోతున్న అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాన్నారు. అలాగే NH-163 (హైదరాబాద్ – మన్నెగూడ) రోడ్డుకు ఉన్న NGT సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొనాలని కోరారు. ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అధిక వాహన రద్దీ మూలంగా.. తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న NH-765 (హైదరాబాద్ – కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ (DPR) తయారీ ప్రక్రియని వేగవంతం చేయాలని సంస్థ ఛైర్మన్‌ను సంతోష్ కుమార్‌ను కోరారు. తక్షణమనే DPR తయారీ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
ఇక రాష్ట్రంలో 16 జాతీయ రహదారుల మంజూరీ, RRR నిర్మాణం, ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనుల పూర్తి వంటి అంశాలపై రెండ్రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గారితో సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ వినతుల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల కోసం కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Jun 26 2024, 19:41