విద్యావంతులు, మేధావులు కాంగ్రెస్ పక్షాన నిలబడండి, సమాచార హక్కు వికాసమతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
విద్యావంతులు, మేధావులు కాంగ్రెస్ పక్షాన నిలబడండి : డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూర్ రఘువీర్ రెడ్డిని గెలిపించాలి
రఘువీర్ రెడ్డిని గెలిపించి రాహుల్ ను ప్రధాని చేయాలి
రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పాలన నిర్ణయాలు అభినందనీయం
దేశంలో చట్టాలు అమలు కావాలంటే కాంగ్రెస్ గెలవాల్సిందే
కాంగ్రెస్ తోనే సమాచార హక్కు చట్టం సాధ్యమైంది
ఈ నెల 13 న జరిగే లోక్ సభ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు కాంగ్రెస్ పక్షాన నిలబడి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వంలో అత్యధిక మెజార్టీ సాధించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. నల్గొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ భవనంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనీ విజయపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఐదు జాతీయ గ్యారెంటీ పథకాల్లో పేద మహిళలకు, రైతులకు, యువకులకు, శ్రామికులకు, విభిన్న కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి పేద మహిళకు ఏడాదికి ఒక లక్ష రూపాయలు ఇవ్వడం అనేది కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తెస్తే, జవహర్ లాల్ నెహ్రూ దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణం చేయగా, రాజీవ్ గాంధీ దేశానికి టెక్నాలజీ పరిచయం చేశారు. సోనియాగాంధీ సమాచార హక్కు చట్టం తీసుకురాగా,ఇదే తరహాలో రాహుల్ గాంధీ పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఐదు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం అభినందనీయం అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి జీవోను అందరికి ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉండేలా, ఆన్లైన్ విధానంలో ఆర్టిఐ దరఖాస్తుల స్వీకరిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. దేశ సమగ్రతను, దేశభక్తి, బహుళ జాతుల సంస్కృతులను, లౌకికవాదం, సమానత్వం రక్షించబడాలంటే దేశంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రభుత్వం దీర్ఘకాలిక నిర్ణయాలు అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విజన్ ను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు. కావున ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలిచే బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ హాయాంలోనే లోక్ పాల్ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, గృహహింస చట్టం, పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాజంలో జరుగుతున్న అవినీతిని బయటకు తీసేందుకు ఆర్టిఐ కార్యకర్తలు నిత్యం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టిఐ చట్టం వచ్చిన తర్వాత సామాన్యుడు గౌరవం పెంచిందని, గతంలో అధికారులు సామాన్యులను పరిగణలోకి తీసుకునేవారు కాదని, ఆర్టిఐ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 140 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం అధికారులకు ఏర్పడిందన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్లను కొద్ది రోజుల్లోనే నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పేర్కొనడం హర్షనీయమన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ కన్న కలలు నిజం కావాలంటే ఆర్టిఐ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రస్తుత పార్టీలు గుర్తించకపోవడం దారుణం అన్నారు. మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ ఏకతాటిపై వచ్చి ప్రజాస్వామ్యంలో ఓటు పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఓటు ద్వారానే మన దేశ అభివృద్ధి ఆధారపడి ఉందని, దీనిని దేశంలోని యువత ప్రతి ఇంట్లో తమ కుటుంబ సభ్యులకు వివరించాలని ఆయన కోరారు.
రాష్ట్ర నాయకులు మాజీ ZPTC గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ పురపాలక సంఘం చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంలో రాజకీయ నాయకులు కూడా భాగస్వామ్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. కొందరు కేంద్రంలో ఇండియా కూటమిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనిని మేధావి వర్గం ఆలోచన చేసి, తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. వికాస సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కాచాం సత్యనారాయణ మాట్లాడుతూ చట్టాన్ని నిర్వీర్యం చేసే పార్టీల పట్ల జాగ్రత్తగా వుండాలని, చట్టాన్ని తెచ్చిన, మద్దతు ఇచ్చే పార్టీ లకు సమాచార కార్యకర్తలు మద్దతుగా వుండాలని అన్నారు.
రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ ఎం ఏ కరీం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలన పారదర్శకత ఉండేందుకు ఆర్టిఐ చట్టాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని వారు తెలిపారు. ఆ చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ప్రjతి ఒక్కరి మీద ఉందన్నారు. నల్లగొండ పురపాలక వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, నల్గొండ ZPTC వంగూరి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర గౌరవ సలహా దారులు కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సమగ్రంగా అమలు కావాలంటే ఆర్టిఐ కార్యకర్తలు కీలకంగా పని చేయాలన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు చట్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీ గోనా రెడ్డి, గాదె వినోద్ రెడ్డి, ఖుర్షీద్ పాష, ముకుంద రెడ్డి, కౌన్సిలర్లలు పున్నా గణేష్, కరుణాకర్ రెడ్డి. సత్యనారాయణ, హేమలత, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు,చిత్రం శ్రీనివాస్, బొగరీ రామకృష్ణ, శ్రీనివాస్, లక్ష్మి విద్యాసాగర్, అశోక్ రెడ్డి, కప్పల క్రాంతి, రమణ, నాగలక్ష్మి, చంద్ర కళ ,
బి వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
May 11 2024, 22:32