లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీని మట్టికరిపించి విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని, మన హక్కులను కాపాడుకునేందుకు విపక్ష కూటమి సర్వశక్తులూ ఒడ్డుతుందని స్పష్టం చేశారు. యూపీలోని సైఫైలో శుక్రవారం ఓ వార్తాసంస్ధతో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న బీజేపీని దీటుగా నిలువరిస్తామని చెప్పారు. రాయ్‌బరేలి నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీకి అఖిలేష్ మద్దతు పలికారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలి నుంచి నామినేషన్ వేసిన రాహుల్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
మరోవైపు రాహుల్ రాయ్‌బరేలి నుంచి పోటీ చేయడంతో కాషాయ పాలకులు భయపడుతున్నారని, అందుకే వారు కుటుంబం, కుటుంబ పార్టీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య, మొయిన్‌పురి ఎస్పీ అభ్యర్ధి డింపుల్ యాదవ్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని ఆమె ఆరోపించారు.
May 03 2024, 21:23