TG Politics: నాపై కుట్ర జరుగుతోంది.. పడేయాలని చూస్తున్నారు : సీఎం రేవంత్
కోడంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు..
సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సోమవారం సీఎం రేవంత్ (Revanth) వచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొడంగల్ నుంచి 60 ఏళ్ల క్రితం అచ్యుతా రెడ్డి మంత్రి అయ్యారు. తర్వాత నియోజకవర్గం నుంచి మంత్రి పదవి చేపట్టలేదు. కొడంగల్ నుంచి గెలిచిన తనకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. 100 రోజుల్లో కొడంగల్‌కు మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, జూనియర్, డిగ్రీ కాలేజీ తీసుకొచ్చానని సీఎం రేవంత్ వివరించారు. అలాంటి తనపై కుట్ర జరుగుతోందని హాట్ కామెంట్స్ చేశారు.
కుట్ర
'వందల కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చా. రూ. 4వేల కోట్లతో నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చాం. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, రేవంత్ రెడ్డిని కిందపడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎందుకు కింద పడేయాలి..? కరువు ప్రాంతానికి నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తి పోతల తెచ్చినందుకా..? కాలేజీలు తెచ్చినందుకా? సిమెంటు ఫ్యాక్టరీ తెచ్చి ఉపాధి కల్పిస్తున్నందుకా? బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణ పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా తేలేదు. కొడంగల్‌ను అభివృద్ధి చేయనీయొద్దని అరుణ కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి అని' సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఎందుకు ఓడించాలి
'లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి..? ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా? లేదంటే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా? పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొడంగల్‌లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎందుకు రేవంత్ రెడ్డిని పడగొట్టాలి? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి? ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? మోదీకి మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా? అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు..
Apr 09 2024, 11:53