బద్దం యాదమ్మ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : కొడారి వెంకటేష్, వయోవృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్
వయోవృద్ధురాలు అని చూడకుండా భూమి పట్టా కోసం, మానసికంగా శారీరకంగా హింసించి, బద్దం యాదమ్మ మృతికి కారణమైన కోడలు, కొడుకు, మనవడి పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా "వయోవృద్ధుల సంక్షేమ సంఘం" కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వలిగొండ మండలం (ఎం) తుర్కపల్లి గ్రామానికి చెందిన బద్దం యాదమ్మ (80), నలుబై ఏళ్ళ క్రితమే భర్తను కోల్పోయి, ఎన్నో కష్టాలు పడి ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెను పెంచి పెద్ద చేసి, వారికి పెళ్ళిళ్ళు చేసి ప్రయోజకులను చేసింది. తనకున్న భూమిని కొంతభాగం పెద్ద కుమారునికి, కొంతభాగం చిన్న కుమారునికి పట్టా చేసింది. కొంత భూమిని తన పేరుమీద ఉంచుకుంది. తన తదనంతరం ఆమె ఇద్దరు కుమారులకు చెందే విధంగా చేయాలని ఆమె కోరింది. కానీ ఇది నచ్చని ఆమె పెద్ద కొడుకు, కోడలు, మనవడు ఆమె పేరు మీదున్న సుమారు మూడు ఎకరాల భూమిని తమకు పట్టా చేయాలని యాదమ్మను, గత కొంత కాలంగా వేధిస్తున్నారు. నేను చనిపోయే వరకూ ఆ భూమి నాపేరు మీదనే ఉంటుందని యాదమ్మ చెప్ఫడంతో , కొడుకు, కోడలు, మనవడు విచక్షణ కోల్పోయి గత ఆదివారం రోజున యాదమ్మ ను చేతులతో, కర్రలతో విపరీతంగా కొట్టి గాయపరిచారు. తల్లికి గాయాలైన విషయం తెలుసుకున్న మోత్కూరు లో ఉంటున్న కుమార్తె కొంతం సువర్ణ, తుర్కపల్లి కి వచ్చి, పరిస్థితి తెలుసుకొని వలిగొండ పోలీసులకు పిర్యాదు చేసి యాదమ్మను చికిత్స కోసం మోత్కూరు కు తీసుకెళ్ళింది. ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తుండగా శుక్రవారం యాదమ్మ కు కడుపులో విపరీతంగా నొప్పి రావడం తో డాక్టరు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్ళాలని సూచించగా మార్గమధ్యంలో యాదమ్మ మృతి చెందారు
. వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదమ్మ పేరునగల భూమిని తన పేరుమీద రిజిష్టర్ చేయాలని, మానసికంగా, శారీరకంగా హింసించిన కొడుకు సాయిరెడ్డి, కోడలు స్వరూప, మనవడు రాంరెడ్డి ల పై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాలని, పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేసే అవకాశం ఉన్నందున సెక్షన్ 201 కింద కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ -2007 ప్రకారం బద్దం యాదమ్మ కు న్యాయం జరగాలని, బద్దం యాదమ్మ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి కి పిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని , అధికారులను, పోలిస్ లను ఆయన కోరారు.
Mar 19 2024, 18:18