Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర
విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర (Maha Padayatra) ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది..
ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, అఖిలపక్షం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే నాగి రెడ్డి, పలు రాజకీయ పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ (Privatization) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్నివ్యతిరేకిస్తున్నట్లు వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలన్నారు..
కాగా విశాఖ ఉక్కును కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. గురువారం గుడివాడలోని రైల్వేస్టేషన్ రోడ్డులో వివిధ కార్మిక సంఘాలతో కలిసి ఆయన రాస్తారోకో చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా కార్మిక ఉద్యమాలను నిర్వహిస్తామన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ముఠా కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌లను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు..
Mar 03 2024, 12:02