ఈనెల 28న వరంగల్ లో జరిగే ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న వరంగల్, LB కళాశాల జయసేన ఆడిటోరియంలో వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా నినాదంతో ఏ ఐ వై ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా "దేశ పాలకుల విధానాలు - నేటి యువత కర్తవ్యం" అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు
ఆత్మకూరు మండల కేంద్రంలోని కరపత్రం,గోడపత్రిక ఆవిష్కరణ ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ 8 దశాబ్దాల స్వాతంత్య్రంలో కేంద్ర ప్రభుత్వం యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేశాయన్నారు. దేశంలో 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్లు లెక్కలు చెబుతున్నాయని, పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాల ఫలితంగా చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదన్నారు. డిగ్రీలు, పి.జి.లు, పిహెచ్.డి.లు, బి.టెక్, ఎం.టెక్, ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., లా కోర్సులు చదివినవారు కూడా చివరకు రైల్వే గ్యాంగ్మెన్ ఉద్యోగాలకు,పోలీస్ కానిస్టేబుల్, హెూమ్ గార్డ్ ఉద్యోగాలకు లక్షల్లో పోటీపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉద్యోగాలులేక, ఉపాధి అవకాశాలులేక వలసలు పోయే వారు కొందరైతే, మరికొంతమంది నిరాశ, నిస్పృహలతో డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ లాంటి మత్తుమందులకు బానిసలవుతున్నారన్నారు. దేశానికి గొప్ప సంపదగా నిలవాల్సిన యువశక్తిని ప్రభుత్వాలు నేరస్థులుగా, ఉగ్రవాదులుగా, విచ్ఛిన్నకారులుగా మారుస్తున్నారని, తద్వారా రాజకీయాలపట్ల విముఖత కలిగేటట్లు యువతను తయారుచేస్తూ సంఘవిద్రోహ శక్తులు, అవినీతిపరులు, దోపిడీదారులు రాజకీయాల్లోకి ప్రవేశించి దేశాన్ని, ప్రజలను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న దేశ భవిష్యత్తును నవయవ్వనంతో తొణికిసలాడే యువత సరికొత్త భారతాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని ఏ ఐ వై ఎఫ్ ఈ సదస్సు ద్వారా పిలుపునివ్వబోతున్నదని వారు స్పష్టంచేశారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు నరేంద్ర మోదీ ప్రభుత్వ కాషాయీకరణను జతచేసి వీటిని వేగంగా అమలుచేయుటకు కేంద్ర ప్రభుత్వం "జాతీయ విద్యా విధానం - 2020” ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని, విద్యార్థుల మెదళ్ళను మొద్దుబార్చి, విద్వేషపు మత్తులో ముంచుటకు అశాస్త్రీయ అంశాలను పాఠ్యాంశాల్లోకి చొప్పించి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని,అందుకే పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ ప్రజాస్వామ్య అంశాలను తొలగిస్తున్నదని ధ్వజమెత్తారు.రాజకీయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, రాజకీయ పార్టీల పై చేస్తున్న కక్ష సాధింపు చర్యలను దేశ ప్రజలంతా తిప్పికొట్టాలని, విభజించు పాలించు అనే నినాదంతో పబ్బం గడపాలనే మోడీ దుష్ట నీచ రాజకీయాలకు, మత రాజకీయాలకు వ్యతిరేకంగా భారతదేశ యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మారుపాక వెంకటేష్, సలగంజి వీరస్వామి,కూరెళ్ళ మచ్చ గిరి, మారుపాక మల్లేష్, సోమనబోయిన నరసింహ, బుర్ర వెంకటేష్, మారుపాక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Feb 27 2024, 11:24