NLG: ప్రేమ జంటలను బెదిరించి ఆభరణాలు, డబ్బులు దోపిడీ చేస్తున్న ముఠా అరెస్ట్
నల్లగొండ: గత కొద్ది రోజులుగా నల్లగొండ శివారులో ప్రేమ జంటలను బెదిరించి సెల్ ఫోన్లు నగదు బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తున్న ఆరుగురి ముఠాను అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.
బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణంలోని నరసింహారెడ్డి కాలనీకి చెందిన కున్చెం సైదులు, కున్చెం ప్రశాంత్, కొత్తగూడెం గ్రామానికి చెందిన చింతా నాగరాజు, రాంనగర్ కు చెందిన లక్ష్మణ్, శివరాత్రి ముఖేష్ , నర్సింహారెడ్డి కాలనీకి చెందిన కున్చెం రాజు ఒక ముఠాగా ఏర్పడి ప్రేమ జంటలను దోపిడీ చేస్తున్నట్లు తెలిపారు.
బుధవారం ఉదయం నల్గొండ టు టౌన్ సిఐ మరియు వారి సిబ్బంది, విశ్వసనీయ సమాచార మేరకు నల్గొండ శివారులో ఉన్న నరసింహారెడ్డి కాలనీలో ఉన్న నేరస్తుడు కున్చెం చందు ఇంటికి వెళ్లి అతని ఇంటిలో ఉన్న మిగతా ఐదుగురు వ్యక్తులను పట్టుకొని విచారించగా.. వారు గత కొద్దిరోజులుగా నార్కట్పల్లి అద్దంకి హైవేపై పోయే ప్రయాణికులు , ప్రేమ జంటలు , ఖాళీ స్థలంలోకి వచ్చి ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని సెల్ఫోన్లలో వీడియో తీసి బెదిరించి కొట్టి వారి దగ్గర ఉన్న నగలు సెల్ ఫోన్లు డబ్బులు తీసుకునేవారమని ఒప్పుకున్నట్లు తెలిపారు.
ఈ విషయం బాధితులు భయపడి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేవారని దోచుకున్న డబ్బును మద్యానికి ఇతర విలాసాలకు ఖర్చు చేసుకునే వారని నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు .వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు, రెండు ఉంగరాలు, రెండు టీవీలు, ఆపిల్ వాచ్, మూడు ఫ్యాన్లు, డ్రిల్లింగ్ మిషన్ , ఒక ఇన్వర్టర్, హోమ్ థియేటర్, గ్యాస్ స్టవ్, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
Feb 08 2024, 22:06