పాలకుల నూతన ఆర్థిక విధానాల వల్ల హక్కులకు భంగం: సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి
ఐక్యత ,పోరాటం, సామాజిక భాద్యత లతో టాప్రా పనిచేస్తుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వెటర్నరీ భవన్ లో జరిగిన టాప్రా జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ సౌకర్యం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెన్షన్ సౌకర్యం తొలగించుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నరేంద్రమోడీ హటావో నినాదం బలపడుతుందని, దానిని అమలు చేసేందుకు మనమంతా కృషి చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం సర్వీసుల్లో ఉన్నవారు, పెన్షనర్లు కలిసి కట్టుగా ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి మాట్లాడుతూ పాలకులు అవలంభిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల రిటైర్డ్ పర్సన్స్ ల హక్కులకు భంగం కలుగుతుందని ఆయన అన్నారు. రూపాయి విలువ తగ్గించడంతో ప్రజలందరూ సంక్షోభం లో పడిపోయరని, స్వాతంత్రం వచ్చిన నాటికి, నేటికి పేదరికం పెరిగిపోయిందని ఆయన అన్నారు. కానీ బడా పారిశ్రామికవేత్తలైన ఆదాని, అంబానీల ఆస్తులు మాత్రం అనేక రెట్లు పెరిగాయని ఆయన అన్నారు. టాప్రా జిల్లా అధ్యక్షులు కడారు రమేష్ బాబు అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ఎల్.అరుణ మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో మార్చి 8 న జరిగే "మహిళా దినోత్సవం" ను ఘనంగా జరుపాలని కోరారు. ఈ సమావేశంలో టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మ కంటి బాలరాజు గత ఏడాది నివేదికను సమర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు అంజయ్య, ఉపాధ్యక్షులు మాటూరి బాలేశ్వర్, నాయకులు ఎస్కే లతీఫ్, శకుంతల, బుగ్గయ్య, మదిర మల్లేశం, పోలి శంకర్ రెడ్డి, జగన్, మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి జిల్లా కమిటీ పక్షాన ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి అందజేశారు.
Feb 08 2024, 20:00