ప్రజా పోరాటాలను బలపరచండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
ప్రజా పోరాటాలను బలపర్చాలని సిపిఎం నిర్వహిస్తున్న ఉద్యమాలకు విరాళాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున బీబీనగర్ మండలం కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ప్రజా పోరాటాలను బలపరచాలని, ఉద్యమాలకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ మండల నాయకత్వంతో కలిసి " కరపత్రం " విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న అనేక ప్రజా సమస్యలను అధ్యయన చేసి వాటి ఆధారంగా ఆందోళన, పోరాట కార్యక్రమాలు రూపొందించడానికి ఇంటింటి సిపిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీలు, మేధావులు, కర్షకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అన్ని విధాలా ఆదరించాలని అన్నారు. దశాబ్దాలు కడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్న నేటికీ జిల్లాలో ఉన్న మౌలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన అన్నారు. హామీలు ఇవ్వడం పదేపదే ప్రజల్ని మోసగించడం పాలకులకు అలవాటుగా మారిందని అన్నారు. గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన వైఫల్యాలు, వాగ్దానాల అమలులో వెనుకబాటుతనం మూలంగా ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారని నూతన పాలకుల పనితీరును కూడా ప్రజలు గమనిస్తున్నారని ఇచ్చిన ప్రతి వాగ్దానాలను ఆచరణలో పెట్టేందుకు ప్రభుత్వం పూనుకొని సంక్షేమ పథకాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలను పరిశీలిస్తే అసంపూర్తి పనులే చాలా మిగిలి ఉన్నాయని బీబీనగర్ ఎయిమ్స్, బస్వాపురం ప్రాజెక్టు, బునాది గాని కాలువ, పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలు, నక్కలగండి ఎత్తిపోతల పనులు నేటికీ పూర్తి కాలేదని ఆవేదన వెలిబుచ్చారు.ఇప్పటికైనా వెంటనే పూర్తి చేయాలని, నిర్మాణం పూర్తి అయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి సర్కారు పాలన గాడి తప్పిందని ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విలువలను, పెడరల్ స్ఫూర్తికి విగాథం కలిగిస్తూ ఏకపక్ష విధానంతో నియంతృత్వం వైపు కొనసాగుతుందని చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా సమస్యల్ని గాలికి వదిలి ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మతోన్మాద రాజకీయ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాసు, మండల కార్యదర్శివర్గ సభ్యులు కందాడి దేవేందర్ రెడ్డి, సందెల రాజేష్, టం టం వెంకటేశం నాయకులు బండారు శ్రీరాములు, మంద కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Feb 07 2024, 21:57