TS:నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 3న ఛలో ఢిల్లీ
నల్లగొండ జిల్లా:
మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం - 2020 ఉపసంహరించుకోవలని PDSU ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నామని PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్ అన్నారు. అందుకు సంబంధించిన కరపత్రాలు నకిరేకల్ పట్టణంలో ఆవిష్కరించారు. పోలె పవన్, మాట్లాడుతూ.. విద్య వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ,కార్పోరేటికరణని అమలు చేయడం మోడీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు.
ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు, స్టైఫండ్లు ఆపివేశారని.. ఎయిడెడ్ కాలేజీలకు, పాఠశాలకు ప్రభుత్వ నిధులను ఆపివేశారని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు మెజారిటీ మత ఉన్మాద విద్యాసంస్థలకు 'ప్రభుత్వ- దాతృత్వ- భాగస్వామ్యం' పేరుతో ప్రభుత్వ నిధులను కేటాయించడం జరుగుతున్నదని, విద్యా రంగంలో వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపించారు.
కాలేజీలలో,యూనివర్సిటీలలో పరిశోధనా సంస్థలలో స్వయం ప్రతిపత్తిని తొలగించి, విద్యార్థుల, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేయడం కొనసాగుతున్నదని దుయ్యబట్టారు..
విశ్వవిద్యాలయాల లో బోర్డ్ ఆఫ్ గవర్నర్లు, ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్, పాఠశాల విద్యలో వాలంటీర్లు, కౌన్సిలర్ల పేరు మీద సంఘ పరివార్ తమ కార్యకర్తలని చొప్పించడానికి ప్రాతిపదికలుగా మారుతున్నాయని అన్నారు.
విద్యారంగంలో అమలు జరుగుతున్న ఫాసిస్ట్ దాడులకు అడ్డుకట్టలు వేయడానికి ఫిబ్రవరి 1నుండి 3 వ తారీకు న్యూ ఢిల్లీలో అఖిల భారత నిరసన ర్యాలీ జరగబోతున్నదని, 3న జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో మహాధర్నా ఉంటుందని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,అధ్యాపకులు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో PDSU నాయకులు హర్షకేతన్, సాత్విక్, ప్రవీణ్, రాజు, మధు, లోకేష్, కుమార స్వామి, హసృత్, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Jan 23 2024, 15:33