NLG: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో నల్లగొండకు అన్యాయం - ఎస్ఎల్బిసి అంతర్భాగంలో డిండి ఎత్తిపోతల డిపిఆర్ లను మార్చాలి: నెల్లికంటి సత్యం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లా కు సాగునీరు అందిస్తామనటం అన్యాయమని ఎస్ ఎల్ బి సి అంతర్భాగం లోని డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని అందుకు అవసరమైన డిపిఆర్లను మార్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 10 సంవత్సరాలు నల్లగొండ జిల్లాకు సాగు తాగునీరు అందించకుండా కాలయాపన చేసిందని అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు సాగు త్రాగునీరు నోచుకోక పోయాయని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిని రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తిచేసి నక్కల గండి ద్వారా దిండి ప్రాజెక్టులోకి లిఫ్ట్ చేసి చర్లగూడెం రిజర్వాయర్ నింపాలని అన్నారు. బ్రాహ్మణ వెల్లం ల ప్రాజెక్టును కిష్టాపురం వరకు పొడిగించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల నిషేధాన్ని సిపిఐ స్వాగతిస్తూ ఆ పోరాటంలో సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరారు.
బిఆర్ఎస్ నుండి సిపిఐ లో చేరిన రేవెల్లి అంజయ్య
మునుగోడు పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు రేవెల్లి అంజయ్య సోమవారం సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సమక్షంలో సిపిఐ లో చేరారు. ఈ సమావేశానికి సురిగి చలపతి అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగూరి నరసింహ, గురుజ రామచంద్రం, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శ్రీను, సహాయ కార్యదర్శి బండమీది యాదయ్య, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, ఈదులకంటి కైలాసం, దుబ్బ వెంకన్న బండారు శంకర్, దయాకర్, ముత్తయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Jan 22 2024, 21:44