Gidugu Rudraraja: అందుకే ఏపీసీసీ పదవికి రాజీనామా చేశా
హైదరాబాద్: సామాన్య కార్యకర్తగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్థాయివరకు తీసుకువచ్చిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఎన్ఎస్‌సీలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత యువజన కాంగ్రెస్, నలుగురు పీసీసీ అధ్యక్షులవద్ద ప్రధాన కార్యదర్శిగా పని చేశానని, ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశానని, ప్రధానంగా దివంగత రాజశేఖర్ రెడ్డికి అనుంగశిష్యుడిగా పని చేసిన అవకాశం లభించిందని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీగా పని చేశానని, 23 నవంబర్, 2022న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని రుద్రరాజు తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలు ముఖ్యంగా భావించి పీసీసీ పదవికి రాజీనామా చేశానన్నారు. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయితే ఏపీలో కాంగ్రెస్ లబ్ది చేకూరుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయం కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినప్పుడు చెప్పానన్నారు. ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని వైఎస్ఆర్ కోరికని వైఎస్ తనయగా ఆ కోరికను తీర్చేందుకు కాంగ్రెస్‌లో పనిచేసేందుకు షర్మిల వస్తున్నారని, అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాలు ముఖ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అందరం కలిసి సమిష్టిగా పని చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో.. ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వైఎస్ షర్మిల రాకతో కొత్త ఉత్సాహం వస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. దివంగత వైఎస్సార్ కుమార్తె కావడంతో ఆమె చేరిక కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీని వీడిన పలువురు నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు
Jan 20 2024, 10:36