నల్లగొండ:బిల్ కిస్ బానో కేసు తీర్పుపై హర్షం :ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి
బిల్ కిస్ బానో కేసు తీర్పుపై హర్షం ....ఐద్వా
గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గం రాజీనామా చెయ్యాలి.....
పాలడుగు ప్రభావతి కేంద్ర కమిటీ సభ్యురాలు (AIDWA)
భారత సుప్రీంకోర్టు బిల్ కిస్ బానో కేసుపై తీర్పునిస్తూ ఆ కేసులో ముద్దాయిలైన 11 మంది విడుదల అవటానికి కారణమైన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రెండు వారాలలోగా 11 మంది ముద్దాయిలను విడుదల అయిన జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలిచ్చిందని ఈ తీర్పును అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి హర్షం వ్యక్తం చేశారు.
న్యాయమూర్తులైన జస్టిస్ నాగరత్నమ్మ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ల సుప్రీంకోర్టు బెంచ్ 2002 నాటి గుజరాత్ లో జరిపిన అత్యాచారాల హంతక ముద్దాయిలకు శిక్షాకాలంలో రెమిషన్ ఇవ్వవచ్చుననే నిర్ణయంతో సిఫార్సు చేసిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను తప్పు పట్టిందని అన్నారు. ఆ సిఫార్సుని ఆధారం చేసుకుని ఒకానొక సుప్రీంకోర్టు బెంచ్ యావత్ జీవకారాగార శిక్ష అనుభవిస్తున్న వారిని 2022 ఆగస్టు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసలు అలాంటి రెమిషన్ యధాలాపపు (Sterio type) నిర్ణయమని, అలాంటి నిర్ణయం గైకొనే అర్హత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు.
2002లో గోధ్రా రైలులో సంభవించిన మారణకాండ సాకుతో, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండిన గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచ మానవాళి సిగ్గుపడేలా అమాయక ముస్లిం ప్రజానీకం పై ఘోరమైన హత్యాకాండ, మహిళలపై అత్యాచారాలు రోజుల తరబడి జరిగాయని అలాంటి దాడుల నుండి తప్పించుకోవటానికి 2002 మార్చి 3వ తేదీన అహ్మదాబాద్ కు దగ్గరలోని రంధిక్ పూర్ అనే గ్రామం విడిచి పోతున్న వారిలో ఐదు నెలల గర్భవతిగా ఉన్న బిల్ కిస్ బానో అనే 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిపి ఆమె మూడేళ్ల పసి బాలికతో సహా 7గురు కుటుంబ సభ్యులను హత్య గావించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంవత్సరం నుండి ఆ కేసు పలు మలుపులు తీసుకుంది. సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిపారు. గుజరాత్ రాష్ట్రంలో విచారణ జరపటానికి వీలులేదని మహారాష్ట్రలో దానిని సాగించగా దాని బొంబాయి ట్రయల్ కోర్టు 11 మంది ముద్దాయిలకు 2008లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది . 2017లో బొంబాయి హైకోర్టు వారి శిక్షను ఖరారు చేసింది. 2019లో సుప్రీంకోర్టు బిల్ కిస్ బానోకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించమని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని అన్నారు.
ఈ కేసులో ముద్దాయిలకు మరణశిక్ష విధించ దగినప్పటికీ దానిని యావత్ జీవకారాగార శిక్షగా మార్పు చేశారని,
కొన్ని కోర్టు సవరణలను అడ్డం పెట్టుకుని 14 ఏళ్ల శిక్షకాలం తరువాత వారికి రెమిషన్ అవకాశాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి కేసు విచారణ జరిగిన, శిక్ష విధించిన మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే రెమిషన్ గురించిన సిఫారసు చేసే అవకాశం ఉన్నది. కానీ, ఆ హక్కును అడ్డం పెట్టుకొని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ సిఫారసు చేసింది. ఆ విధంగా భయంకర నేరానికి పాల్పడిన 11మంది ముద్దాయిలకు 75 ఏళ్ల స్వాతంత్ర అమృతకాలం అని పేరుపొందిన 2022 ఆగస్టు 15న విడుదల అయ్యే అవకాశం లభించింది. వారిని గుజరాత్ రాష్ట్ర బిజెపి నాయకులు దండలతో అభినందనలతో స్వాగత సత్కారాలు నిర్వహించటం విజయోత్సవాలు జరిపటం సిగ్గుచేటు అన్నారు.
ఈరోజు తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు, తనకు లేని అధికారాలను ఉపయోగించుకుని బిల్ కిస్ కేసులో ముద్దాయిలకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ వచ్చేట్లు చేయటాన్ని తప్పు పట్టిన దృష్ట్యా, తక్షణమే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం రాజీనామా చేయాలన్నారు. నేడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను పూర్తిగా ఖండిస్తూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం ఐద్వా హర్షం వ్యక్తం చేస్తుందని తెపారు. గుజరాత్ రాష్ట్ర క్యాబినెట్ రాజీనామా చేయాలని ఐద్వా తరుపున డిమాండ్ చేస్తున్నారు.
Jan 11 2024, 22:29