ఢిల్లీ: ఖైదీలకు పిల్లల్ని కనే హక్కు కల్పించిన హైకోర్టు
వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న వ్యక్తికి.. నాలుగు వారాల పాటు పెరోల్ మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న అతని భార్య, అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
భార్య వయసు 38 ఏళ్లు, భర్త వయసు 41 ఏళ్లను ప్రస్తావిస్తూ, శిక్షా కాలం పూర్తయ్యాక ఆ దంపతులకు సంతానాన్ని పొందే వయసు మీరి పోతుందని వయో భారం వారి ఉమ్మడి ఆకాంక్షకు అవరోధంగా మారుతుందని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ అభిప్రాయ పడ్డారు.
తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ప్రభుత్వం అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులోని పూర్వాపరాలను పరిశీ లించిన తర్వాత ఖైదీకి తన వంశాన్ని నిలుపుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తీర్పులో వివరించారు.
అయితే దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని.. కేవలం వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఖైదీ ఇప్పటికే 14 ఏళ్లుగా జైలులో ఉన్న విషయాన్నీ న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
పెరోల్ కోసం రూ.20 వేలకు వ్యక్తిగత బాండును సమర్పించడంతో పాటు ఒకరి పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించారు. కోర్టు షరతులు పూర్తి చేయడంతో జైలు నుంచి ఆ ఖైదీని పెరోల్ పై విడుదల చేశారు.
Dec 30 2023, 14:32