నర్సాపూర్ నుంచి బరిలోకి దిగుతా
- పార్టీ కోసం కష్టపడిన నన్నే పక్కకు పెట్టేస్తారా?
- టికెట్ విషయంపై అధిష్ఠానం పునరాలోచించాలి
- బీఆర్ఎస్ కు, సునీతాలక్ష్మారెడ్డికి రాజిరెడ్డి కోవర్ట్
- మూడురోజుల్లో నిర్ణయం తీసుకోకుంటే మా కార్యచరణ ప్రకటిస్తాం
కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధకరమని ఆ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జి గాలి అనిల్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో తనకే టికెట్ వస్తుందని భావించిన గాలి అనిల్ కుమార్ టికెట్ తనకు రాకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
దీంతో ఆయన శనివారం తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ పార్టీలోని నాయకులు తనకు ఏ పని చెప్పిన కష్టపడి చేశానని, అలాంటి తనకు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి, సునీతాలక్ష్మారెడ్డికి కోవర్ట్ అయినా ఆవుల రాజిరెడ్డికి టికెట్ కేటాయించడం దారుణమన్నారు. గత ఎన్నికల్లో కూడా తాను పటాన్ చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించానని అక్కడ కాకుండా నర్సాపూర్ టికెట్ కేటాయిస్తామన్నారని, ఇక్కడ పార్టీని అభివృద్ధి చేశానని, నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోతూ పార్టీని బలపర్చానన్నారు. ఇప్పుడు తనకు టికెట్ కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికేనా పార్టీ నిర్ణయం మార్చుకుని మూడురోజుల్లో టికెట్ తనకు కేటాయించకుంటే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నరు.
Oct 29 2023, 12:44