జిపి కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి పండగపూట పస్తులతో ఉంచొద్దు
కలెక్టర్ డిపిఓ లకు వినతి పత్రం ఇచ్చిన యూనియన్ నాయకులు.
రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దసరా పండుగ పూట గ్రామపంచాయతీ కార్మికుల్ని పస్తులు ఉంచకుండా పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామపంచాయతీ కార్మికులకు ఆరు ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇప్పించాలని జిల్లా కలెక్టర్ మరియు డిపిఓలకు వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 844 గ్రామపంచాయతీలలో సుమారు 3200 మంది కార్మికులు వివిధ రకాల పనులు చేస్తున్నారని వీరిలో 90% పైగా పేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారని అన్నారు.
గ్రామ పంచాయతీలలో అనేక కష్టనష్టాలకు ఓర్చి పనిచేస్తున్న వీరికి ఇచ్చే వేతనాలు తక్కువే అని అవి కూడా ఆరేడు నెలలుగా పెండింగ్ లో ఉండడంతో అప్పులు సప్పులు చేసి బ్రతకాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో దసరా ఆ తర్వాత దీపావళి పండుగలు రానున్నాయని ఇప్పటికే అప్పులు పెరిగిపోవడంతో కొత్తగా అప్పులు దొరకక గ్రామపంచాయతీ కార్మికులు దసరాపండుగ రోజున పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందని అందుకే జిల్లా కలెక్టర్ డిపిఓ జోక్యం చేసుకొని కార్మికులకు వేతనాలు ఇప్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వినతి పత్రం ఇచ్చిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండం పెళ్లి సత్తయ్య, యూనియన్ జిల్లా నాయకులు ఇరిగి ఎల్లేష్, సురేష్ శ్రీకాంత్ నరేష్తదితరులు పాల్గొన్నారు.
Oct 18 2023, 20:50