అక్టోబర్ 4న విచారణకు హాజరు కానున్న నారా లోకేష్
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ఏ-14గా ఉన్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను విచారణకు హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
అక్టోబర్ 4న ఉదయం గం. 10.00కి తాడేపల్లిలోని తమ కార్యాలయానికి రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన సీఐడీ బృందం శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుంది.
బయల్దేరే ముందే నారా లోకేశ్ వ్యక్తిగత సిబ్బందితో సీఐడీ అధికారులు మాట్లాడారు. ఢిల్లీ చేరుకున్నా ఎక్కడ కలవచ్చో చెబుతామని వ్యక్తిగత సిబ్బంది సీఐడీ అధికారులు చెప్పారు.
సీఐడీ బృందం ఢిల్లీ చేరుకునే సమయానికి నారా లోకేశ్ అశోక రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసం 50, అశోక రోడ్ లో ఉన్నారు. అయితే ఆ ఇల్లు ఎంపీ గల్లా జయదేవ్‌ది కావడంతో అనుమతి లేకుండా అధికారులు అక్కడికి వెళ్తే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కింద సీఐడీ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అందుకే సీఐడీ అధికారులు గల్లా జయదేవ్‌ను సంప్రదించి ఇంట్లోకి వచ్చేందుకు అనుమతి కోరినట్టు తెలిసింది. సాయంత్రం సరిగ్గా గం. 4.50 సమయంలో ముగ్గురు సీఐడీ అధికారులు గల్లా జయదేవ్ నివాసానికి చేరుకున్నారు.
Oct 01 2023, 09:12