భారత్ పై ఆసీస్ ప్రతీకార విజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో పర్యాటక ఆసీస్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
అయితే, తొలి రెండు వన్డేల్లో గెలిచిన భారత్.. సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలోనే ఉంది. నెంబర్ 1 ర్యాంక్‌తోనే వన్డే వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది.
అటు ఆస్ట్రేలియా.. వన్డేల్లో 5 ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. వన్డే వరల్డ్ కప్ ముందు కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం.. ఆ జట్టులో ఉత్సాహం నింపింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ రోహిత్ శర్మ శుభారంభం అందించాడు. 57 బంతుల్లో 81 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి నివ్వడం, ఇషాన్ కిషన్‌కు జ్వరం రావడంతో ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.
తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం సుందర్ (18) ఔట్ అయ్యాడు. అనంతరం కోహ్లీ (56), రోహిత్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. 6కు పైగా రన్ రేట్‌తో పరుగులు సాధించడంతో భారత్ లక్ష్యం దిశగా వెళ్లింది.
అయితే 21వ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ.. మ్యాక్స్‌వెల్ పట్టిన అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 144. 26.5 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 171 వద్ద విరాట్ కోహ్లీ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (26) కాసేపు నిలబడినా స్వల్వ వ్యవధిలోనే ఇద్దరూ వెనుదిరిగారు.
సూర్యకుమార్ యాదవ్ (8) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో 257 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్.. విజయావకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగతా మూడు వికెట్లను తీసిన ఆసీస్.. 49.4 ఓవర్లలో 286 పరుగులకు భారత్‌ను ఆలౌట్ చేసింది.....
Sep 28 2023, 13:12