గణేష్ ఉత్సవ కమిటీలకు మట్టి విగ్రహాలు పంపిణీ: మంత్రి జగదీష్ రెడ్డి
ఎప్పటిలాగే ఈ వినాయక చవితికి కూడా మట్టి విగ్రహాలను పెట్టుకుని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
సూర్యాపేటను పర్యావరణహితమైన పట్టణంగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు. వినాయక నవరాత్రి పూజలను పురస్కరించుకుని సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలకు శుక్రవారం మట్టి విగ్రహాలను అందజేశారు.
మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తలో సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని చెప్పారు.
ప్లాస్టిక్ నివారణ విషయంలో కూడా సూర్యాపేట ముందుండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్లాస్టిక్‌తో ముప్పు పొంచి ఉన్నదని, ప్లాస్టిక్ నివారణ కోసం మనం చేయగలిగిన మేలు చేయాలని మంత్రి సూచించారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కాలుష్యం అవుతుందని, ఆ నీటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని మంత్రి తెలిపారు.
ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నీరు, భూమి, గాలి కలుషితమై క్యాన్సర్ వ్యాధులు వస్తాయని, అందుకే మట్టి విగ్రహాలు పెట్టుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.
గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతున్నదని చెప్పారు.ఉత్సవ కమిటీలు విధిగా మట్టి విగ్రహాలను పూజించాలని మంత్రి కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న మట్టి విగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కొత్తగా సీడ్ విగ్రహాలను తయారు చేశారని, ఈ విగ్రహాలను ఇండ్లలో పూజించి భూమిలో నాటితే మొక్కలుగా పెరుగుతాయని, అలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతారని మంత్రి పేర్కొన్నారు...
Sep 15 2023, 13:41