రేపు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్:
దేశ వైద్యవిద్య చరిత్రలో తెలంగాణ వరుసగా రికార్డులు సృష్టిస్తున్నది. నిరుడు ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఈసారి ఏకంగా 9 కళాశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమైంది.
15న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏమూల ఎవరికి ఏ కష్టం వచ్చినా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కయ్యేవి. వందల కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వచ్చేది. సకాలంలో వైద్య సదుపాయం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది. ఉద్యమ సమయంలో ఇవన్నీ కండ్లారా చూసిన కేసీఆర్.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టిసారించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తూనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.
తొమ్మిదేండ్లలో 29 కాలేజీలు
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఉన్నవి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే. వీటిలో ఉస్మానియా (1946), గాంధీ (1954) మెడికల్ కాలేజీలు ఉమ్మడి ఏపీ ఆవిర్భావానికి ముందు నుంచే ఉన్నాయి. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీని ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేస్తే ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నది. అంటే దాదాపు ఆరు దశాబ్దాల్లో ఉమ్మడి పాలకులు తెలంగాణలో ఏర్పాటు చేసింది కేవలం రెండే కాలేజీలు. అవి.. ఆదిలాబాద్‌లో రిమ్స్, నిజామాబాద్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ. మొత్తంగా చూస్తే కేవలం నాలుగు జిల్లాల్లోనే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ, స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. అంటే సగటున ఏడాదికి మూడు కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఏకంగా ఒకేసారి 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానుండడం దేశ వైద్యవిద్య రంగంలోనే సరికొత్త చరిత్ర కానున్నది.
ఐదున్నర రెట్లు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి 850 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి.
ఈ ఏడాది కొత్త కాలేజీలతో కలిపి ఆ సంఖ్య 3,790కి పెరిగింది. వచ్చే ఏడాది మరో 800 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 4,590కి పెరుగుతుంది. అంటే.. 9 ఏండ్లలోనే ఐదున్నర రెట్లు పెరుగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 2014 నాటికి 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఈ ఏడాదితో 8,340కు పెరిగాయి...
Sep 14 2023, 12:32