Supreme Court: సుప్రీం కోర్టు న్యాయవాదిని దారుణంగా చంపేసిన భర్త.. ఎందుకంటే..?
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయవాదిని ఆమె భర్తనే దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టాడు.
తాను స్టోర్ రూంలో దాక్కున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 61 ఏళ్ల సుప్రీం కోర్టు న్యాయవాది రేణు సిన్హా, 62 ఏళ్ల ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హా నోయిడాలోని సెక్టార్ 30లో గల బంగ్లాలో నివాసం ఉంటున్నారు. నితిన్ నాథ్ సిన్హా మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. వారి కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు.
అయితే రెండు రోజులగా రేణు సిన్హా కనిపించకుండాపోయింది. ఆమె సోదరుడు ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. న్యాయవాది సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు వారు నివాసం ఉండే బంగ్లాలోకి ప్రవేశించారు. బంగ్లా మొత్తం వెతకగా బాత్‌రూమ్‌లో రేణు సిన్హా మృతదేహం లభించింది. ఈ ఘటన శనివారం జరిగింది.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి రేణు సిన్హా భర్త నితిన్ సిన్హా కూడా కనిపించకపోకుండాపోయాడు. దీంతో న్యాయవాది సోదరుడు తన సోదరిని ఆమె భర్తనే హత్య చేశాడని ఆరోపించాడు. పైగా భార్యభర్తలిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు కూడా జరుగుతున్నట్టు తెలిపాడు. అనంతరం న్యాయవాది భర్త నితిన్ కోసం పోలీసులు గాలించగా అచూకీ లభించలేదు. చివరికి నితిన్ ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేశారు.
అది లాయర్ బంగ్లా వద్ద చూపించింది. బంగ్లాలో వెతకగా స్టోర్ రూంలో నితిన్ దొరికాడు. భార్యను హత్య చేశాక 36 గంటలపాటు నితిన్ స్టోర్ రూంలోనే దాక్కున్నాడు. అదుపులోకి తీసుకుని విచారించగా భార్యను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. తమ బంగ్లాను విక్రయించే విషయంలో భార్యభర్తల మధ్య నెలకొన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. నితిన్ బంగ్లాను రూ.4 కోట్లకు విక్రయించడానికి ప్లాన్ చేశాడని, అంతేకాకుండా అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు చెప్పారు. కానీ బంగ్లాను అమ్మడాన్ని నితిన్ భార్య రేణు సిన్హా వ్యతిరేకించిందని పేర్కొన్నారు. ఈ వివాదమే భార్యభర్తల మధ్య తరచుగా గొడవలకు దారి తీసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు నితిన్ నాథ్ సిన్హాపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు..
Sep 11 2023, 17:57