Rahul Gandhi: మేం పెట్టిన పేరు చిరాకు పుట్టిస్తుందేమో..?: కేంద్రానికి రాహుల్ కౌంటర్
పారిస్: కేంద్రం 'ఇండియా' పేరును మారుస్తుందంటూ వస్తోన్న ఊహాగానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ప్రతిపక్షాల కూటమికి 'ఇండియా' పేరు పెట్టడం వల్ల ప్రభుత్వం చిరాకుపడి ఉండొచ్చని వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న ఆయన.. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
''రాజ్యాంగం.. రెండు పేర్లను వాడుతోంది. అందులో 'ఇండియా, భారత్' అని ఉంటుంది. ఈ పేర్ల విషయంలో ఎలాంటి సమస్యా లేదు. ఆ రెండు పేర్లు ఆమోదయోగ్యమైనవి. అయితే మా కూటమికి ఇండియా పేరు పెట్టి.. మేం ప్రభుత్వాన్ని చిరాకుకు గురిచేసి ఉండొచ్చు. అదే పేరు మార్చాలనే వారి నిర్ణయానికి దారి తీసి ఉండొచ్చు' అంటూ రాహుల్(Rahul Gandhi) చిరునవ్వు చిందించారు.
శని, ఆదివారాలు భారత్ జీ20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించింది. దానిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అతిథులకు పంపిన ఆహ్వానంపై President of India అని బదులుగా President of Bharat అని ముద్రించడంతో ఈ పేరు మార్పు అంశంపై చర్చ మొదలైంది.
అలాగే జీ20 సదస్సు(G20 Summit)లోనూ కేంద్రం భారత్‌పేరునే ఉపయోగించింది. ఈ సమావేశంలో మోదీ కూర్చున్న స్థానం వద్ద నామఫలకంపై మన దేశం పేరును 'భారత్'గానే పేర్కొన్నారు. అంతేకాదు సదస్సును ప్రారంభిస్తూ.. ప్రధాని మోదీ కూడా 'భారత్ మీకు స్వాగతం పలుకుతోంది' అని వ్యాఖ్యానించారు.
Sep 11 2023, 15:24