ఘోల్లుమంటున్న బంతిపూలు: గిట్టుబాటు ధర లేక రైతన్న దిగులు
మన రాష్ట్రంలో బంతిపూలకు ప్రత్యేకత ఉంది. ఏ వ్రతమైనా, ఏ పూజకైనా మొదటగా గుర్తుకు వచ్చేది బంతిపూలే కావటం విశేషం. అందునా శ్రావణమాసం ప్రారంభం కావటంతో పండుగలు, శుభకార్యాలు వరస పెట్టి జరుగుతుండటంతో ఏడాది పొడవునా బంతిపూల సాగు చేసిన రైతులు అధిక లాభాలు పొందొచ్చని ఆశపడ్డారు.
ఇప్పుడు ఆ ఆశ నిరాశే అయ్యింది. కిలో రూ 5 రూపాయలకు మించి ధర రాకపోవడంతో రైతుల్లో కలవరం మొదలయ్యింది. లాభాల మాట అటుంచితే పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా రాదోసన్న అనుమానంతో రైతుల కలవరపాటుకు లోనవుతున్నారు.
విజయవాడ పూలమార్కెట్లో శనివారం బంతిపూల ధర కిలో ఐదు రూపాయలు పలికింది. గత నాలుగు రోజుల నుంచే పది రూపాయలుగా ఉన్న ధరలు శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఐదు రూపాయలకు పడిపోయాయి.
దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మకానికి తీసుకువచ్చిన బంతి పూలను రైతులు విజయవాడ మార్కేట్ వద్ద రోడ్లపై పడేసి నిరాశగా వెనుతిరిగారు. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోగా బాడుగ కూడా రాకపోవటంతో కన్నీటి పర్యంతం అయ్యారు. నంద్యాల, మహానంది. కర్నూలు జిల్లా నుంచి అమ్మకానికి తీసుకువచ్చిన రైతులు ఉసూరుమన్నారు. ఇటువంటి ధరలు ఎప్పుడూ చూడలేదని పలువురు పూలవ్యాపారులు తెలిపారు. శ్రావణమాసం అందులోనూ చివరి శుక్రవారం పూలకు గిరాకీ ఉంటదని భావించి పెద్ద ఎత్తున విజయవాడ మార్కెట్ కి బంతిపూలను తీసుకువచ్చిన రైతులు వ్యాపారులు నిరాశగా వెనుదిరిగారు...
Sep 11 2023, 10:31