చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ కామెంట్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరిట 550 కోట్ల స్కామ్ జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వానికి 371 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. నకిలీ ఇన్ వాయిస్ ద్వారా సెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తెలిపారు. అలాగే తమ దర్యాప్తులో ప్రధాన నిందితుడు చంద్రబాబునాయుడే అని తేలిందన్నారు.
అన్ని లావాదేవవీలు చంద్రబాబుకు తెలిసే జరిగినట్లు చెప్పారు. అలాగే ఈ స్కామ్‌కు సంబంధించి కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని ఆరోపించారని తెలిపారు. ఈడీ, జీఎస్‌టీ ఏజెన్సీలు కూడా ఈ స్కాంపై దర్యాప్తు చేశాయన్నారు.
అంతేగాక ఈ స్కామ్‌లో ఫైనల్ బెనిఫిషరీ కూడా చంద్రబాబే అని, న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందన్నారు. 2014 జూలై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ముందే డిజైన్ టెక్‌తో ఒప్పందం కుదిరిందన్నారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సంస్థ బాధ్యతలు గంట సుబ్బారావు అప్పగిస్తూ ఏకంగా నాలుగు పదవులు కట్టబెట్టారని చెప్పారు. లోకేష్ పాత్రతో పాటు ఇతరుల పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై విచారణ చేస్తామన్నారు..
Sep 09 2023, 13:06