నవంబర్ లో డిఎస్సి ఈనెల 20 నుండి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన లక్షల మంది నిరుద్యోగులకు తెలంగాణ సర్కా రు తీపి కబురు చెప్పింది. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, సీబీటీ నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇటీవలే 5,089 ఉపాధ్యాయ ఖాళీలతోపాటు మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇటీవలే ఆ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ముందుగా చెప్పినట్టుగానే నోటిఫికేషన్ జారీ చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు,ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి.. మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్,సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
త్వరలోనే.. మిగిలిన 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీకి సైతం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. వివరాలకు https://schooledu. telangana. gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది........
Sep 09 2023, 09:13