G20 Summit: భారత అల్లుణ్ని.. ఈ పర్యటన ఎప్పుడూ ప్రత్యేకమే: రిషి సునాక్
లండన్: జీ20 శిఖరాగ్ర సదస్సు నిమిత్తం బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ భారత్‌కు చేరుకున్నారు. తన సతీమణి అక్షతామూర్తితో కలిసి దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి ఆశ్వినీ చౌబే, భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ సహా ఇతర సీనియర్ దౌత్యవేత్తలు ఆయనకు స్వాగతం పలికారు..
వారి గౌరవార్థం ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనను వారు ప్రశంసించారు.
అంతకుముందు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్ అక్కడి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనని 'భారతదేశ అల్లుడు'గా వ్యవహరిస్తుండడాన్ని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. ఆప్యాయతతోనే తనని అలా పిలుస్తున్నారని ఆశిస్తున్నానన్నారు. భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్ (Rishi Sunak) వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను భారత పర్యటనకు వెళుతున్నానని చెప్పారు..
Sep 08 2023, 18:23