ఎమ్మెల్సీ కవిత పోరాటంతో కేంద్రంలో కదలిక: ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశంస
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలో కదలిక రావడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన కారణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రశంసించారు. ఆమె వల్లే దేశంలోని రాజకీయ పార్టీలు ఆ బిల్లుపై పట్టుబడుతున్నాయని చెప్పారు.
గురువారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూనే ఆమెను అభినందిస్తున్నామని కృష్ణయ్య తెలిపారు.
మహిళా బిల్లుపై కవిత ఉద్యమించడం, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయడంతోపాటు దేశవ్యాప్తంగా మహిళల రక్షణ, హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలు తోడ్పాటును అందించాయని పేర్కొన్నారు.
మహిళా బిల్లును స్వాగతిస్తున్నామని స్పష్టంచేశారు. ఈ బిల్లులో బీసీ మహిళలకు న్యాయమైన వాటా దక్కేలా ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్ పార్టీ అవసరమైన కార్యాచరణ చేపట్టాలని కోరారు.
మహిళా బిల్లుకు బీసీలు వ్యతిరేకం కాదని, అయితే బీసీ బిల్లు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయనే చర్చ జరిగిన ప్రతిసారీ మహిళా బిల్లును తెరమీదకు తెస్తున్నారని, దీనివల్ల హక్కుల కోసం కొట్లాడే వర్గాల మధ్య తగువు పెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని దుయ్యబట్టారు..
Sep 08 2023, 15:03