చంద్రయాన్ - 3 కీలక ఘట్టం షురూ !
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. కీలక దశకు చేరుకుంది. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్నాయి.
2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో.. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. అదే సమయంలో రష్యాకు చెందిన మూన్ మిషన్ లూనా 25 కూడా విఫలం కావడం, క్రాష్ ల్యాండింగ్ కావడం.. వంటి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటోంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ల్యాండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది ఇస్రో.
ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండర్, రోవర్ ల్యాండింగ్‌ను ఖచ్చితంగా విజయవంతం చేసి తీరాలనే పట్టుదలతో ఉంది. లూనా 25 ఎందుకు క్రాష్ ల్యాండింగ్ అయిందనే విషయంపై ఆరా తీస్తోంది. రష్యా స్పేస్ ఏజెన్సీ నుంచి సమాచారాన్ని తెప్పించుకుంటోంది.ముందుగా నిర్దేశించిన షెడ్యూల్.. అంటే ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6:04 నిమిషాలకు ల్యాండింగ్ కావాల్సి ఉంది చంద్రయాన్ 3.
ఆ సమయానికి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించకపోయినా ల్యాండింగ్‌ను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చింది ఇస్రో. మళ్లీ ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి చేపట్టాలని భావిస్తోంది.
ఈ విషయాన్ని ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ వెల్లడించారు.
నిర్దేశిత సమయానికి చంద్రుడిపై వాతావరణం అనుకూలించకపోయినా, ఇంకేదైనా అవాంతరాలు చోటు చేసుకున్నా ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తామని ఆయన స్పష్టం చేశారు.చంద్రయాన్-3 చంద్రునిపై దిగడానికి రెండు గంటల ముందు.. దీనిపై నిర్ణయం తీసుకంటామని దేశాయ్ పేర్కొన్నారు. ల్యాండర్ మాడ్యూల్ పనితీరు, చంద్రుడి ఉపరితలంపై పరిస్థితుల ఆధారంగా నిర్దేశిత సమయంలో దాన్ని ల్యాండ్ చేయడం సరైనదా? కాదా? అనేది ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు నిర్ణయిస్తామని అన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనట్టయితే ఈ ప్రక్రియను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేస్తామని పేర్కొన్నారు.
Aug 22 2023, 12:35