Manipur Violence: మణిపుర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ముగ్గురి మృతి
ఇంఫాల్: తెగల మధ్య వైరం కారణంగా గత వందరోజులుగా హింసాత్మకంగా మారిన మణిపుర్ (Manipur)లో మరోసారి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఉఖ్రుల్ (Ukhrul) జిల్లాలో శుక్రవారం ఉదయం సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారు..
ఉఖ్రుల్ జిల్లా పోలీసు అధికారి ఎన్. వాషుమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి 47 కి.మీ దూరంలో కుకీ తెగవారు నివసించే తోవాయి కుకీ అనే గ్రామంపైకి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో కొండపై నుంచి సాయుధ మూకలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయి.
ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన వారి కోసం రాష్ట్ర పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు..
మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
మరోవైపు కుకీ-జో తెగల నివాసిత ప్రాంతాలకు స్వయంప్రతిపత్తిని ప్రకటించాలని గిరిజన మహిళల వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో చెలరేగిన హింస కారణంగా సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మూడు వేల మంది వరకు గాయపడ్డారు. ఆందోళనలను కట్టడి చేసి, శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు 40 వేల కేంద్ర బలగాలను మోహరించింది..
Aug 18 2023, 16:18