BA.2.86: కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి.. అప్రమత్తమైన WHO, సీడీసీ!
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 (Corona Virus) వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి..
తాజాగా అమెరికాలో కొవిడ్ 19కి చెందిన కొత్త రకాన్ని గుర్తించారు. ఈ వేరియంట్‌ను బీఏ.2.86గా పేర్కొన్నారు. దీనిని అమెరికాతోపాటు డెన్మార్క్, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు.
దీంతో అప్రమత్తమైన అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (CDC).. దీన్ని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ రకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని.. కరోనా నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది..
ఈ బీఏ.2.86 కొత్త రకానికి సంబంధించి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. ఇందులో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటున్నందున.. ప్రస్తుతం దీన్ని 'వేరియంట్ అండర్ మానీటరింగ్'గా పేర్కొన్నామని తెలిపింది.
ఈ రకానికి చెందిన సీక్వెన్స్‌లు కొన్ని దేశాల్లోనే వెలుగు చూశాయని.. ప్రస్తుతం మూడు వేరియంట్ ఆఫ్ ఇంటెరెస్ట్‌లతోపాటు
ఏడు వేరియంట్స్ అండర్ మానిటరింగ్‌లను ట్రాకింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి, తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని.. దీనిపై ప్రపంచ దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నట్లు తెలిపింది..
Aug 18 2023, 16:17