హ్యాట్రిక్ కోసం కేసిఆర్ సర్కార్ ఫోకస్ !
- ఆగస్ట్ 21న అభ్యర్థుల ఎంపికపై జాబితా విడుదల
- నేతల్లో కొనసాగుతున్న టెన్షన్
- సిట్టింగులగే టికెట్ల కేటాయింపుకు మొగ్గు
- ప్రజల్లో ఉండాలని నేతలకు కేసిఆర్ పిలుపు
తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్దుల జాబితాలు సిద్దం అవుతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సీఎం కేసీఆర్ తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ నెల 21న దాదాపు 60 మందితో లిస్టు విడుదలకు రంగం సిద్దమైంది. అందులో ఇప్పుడు సిట్టింగ్ లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో, లిస్టులో ఉండేదెవరు.. మారేదెవరనేది ఆసక్తి కరంగా మారింది. కొందరు మంత్రులను లోక్ సభకు పంపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలి జాబితాపై కసరత్తు:
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్ జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న 60 మందికి పైగా పేర్లతో లిస్టు ప్రకటించన్నారు. గెలుపు గుర్రాలకు ప్రాధాన్యతనిస్తూ, ఆచితూచి అభ్యర్థుల ఎంపిక జరిగింది. సిట్టింగ్ లకు తిరిగి సీట్ల ఖరారులో ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేసినట్లు సమాచారం.
పూర్తైన గ్రౌండ్ సర్వే;
సర్వే నివేదికల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు. 20 మందికిపైన సిట్టింగ్ లకు టికెట్ దక్కదని తెలుస్తోంది. వారికి ఇప్పటికే బుజ్జగింపులు మొదలయ్యాయి. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో ఇతర అవకాశాలు ఇస్తామని కీలక నేతలు నచ్చజెప్తున్నట్టు సమాచారం.
సిట్టింగులకు టికెట్ల కేటాయింపు డౌటే ?
దక్కేదెవరు..మారేదెవరు.. ఇదే సమయంలో టికెట్ దక్కదనే సంకేతాలు అందుకున్న ఎమ్మెల్యేలు కేడర్‌తో భేటీలు జరుపుతూ బలప్రదర్శన ద్వారా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలు, 2018లో కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరినవారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
2018లో ఏడుగురు సిట్టింగ్ లకు కేసీఆర్ టికెట్లు నిరాకరించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది, టీడీపీ నుంచి ఇద్దరితోపాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మళ్లీ టికెట్ ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారిలో ఒకరిద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని సమాచారం.
Aug 18 2023, 13:09