Nitish kumar: 'ఇండియా'ను చూసే ఎన్డీయే హడావుడి భేటీలు: నీతీశ్ విమర్శ
పాట్నా: విపక్ష పార్టీల కూటమి 'ఇండియా'ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆందోళన చెందుతున్నారని బిహార్ సీఎం, జేడీయూ నేత నీతీశ్ కుమార్(Nitish kumar) అన్నారు..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 'ఇండియా' కూటమి అద్భుతమైన పనితీరు కనబరుస్తుందనే ఆందోళన ఆయనకు పట్టుకుందని విమర్శించారు. బుధవారం దిల్లీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి నివాళులర్పించిన ఆయన గురువారం పట్నాకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా నీతీశ్ విలేకర్లతో మాట్లాడారు. వైద్య పరీక్షల కోసమే తాను దిల్లీ వెళ్లినట్టు చెప్పారు. అయితే, తాను ఎంతగానో అభిమానించే దివంగత నేత వాజ్‌పేయీ వర్థంతి అదే రోజు కావడం యాదృచ్ఛికమేనన్నారు. గతేడాది భాజపాతో బంధానికి గుడ్‌బై చెప్పి బిహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్.. వాజ్‌పేయీ సారథ్యంలోని ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
వాజ్‌పేయీ ఏదోఒకరోజు ప్రధాని అవుతారని తాను ముందే ఊహించానని.. అదే నిజమైందన్నారు. 1999లో వాజ్‌పేయీ సారథ్యంలోని కూటమికి ఎన్డీయే అని పేరు పెట్టారని గుర్తు చేసుకున్నారు.
అలాగే, ప్రధాని మోదీ పేరును ప్రస్తావించకుండానే నీతీశ్ పరోక్షంగా పలు విమర్శలు చేశారు. ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్న సమయంలో ఏనాడూ సమావేశాల గురించి పట్టించుకోలేదన్న నీతీశ్.. 'ఇండియా' కూటమి సమావేశాలు నిర్వహిస్తుండటంతో హడావుడిగా సమావేశాలు నిర్వహిస్తోందని నీతీశ్ వ్యాఖ్యానించారు.
మోదీ హయాంలో భాజపా తన మిత్రపక్షాలను గౌరవించడమే మానేసిందని నీతీశ్ ఆరోపించారు. రెండు నెలల క్రితం పట్నాలో జరిగిన విపక్ష కూటమి తొలి సమావేశానికి నీతీశ్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే, 'ఇండియా' కూటమి సారథ్యం వహించిన నీతీశ్ రెండు నెలల క్రితం విపక్ష కూటమి తొలి సమావేశం జరగ్గా.. ఇండియా కూటమిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి పనితీరు అద్భుతంగా, దేశానికి శుభసూచికంగా ఉంటుందని నీతీశ్ అన్నారు..
Aug 17 2023, 21:09