లైంగిక వేధింపులకు పాల్పడితే అవసరమైతే ఉరి తీయిస్తాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థినులపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. స్కూల్‌లోని కీచక అధికారి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు పత్రికలో వచ్చిన కథనం తీవ్ర కలకలం రేపింది.
కాగా, ఆదివారం ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందిచారు. విద్యార్థునుల పట్ల నీచంగా వ్యవహరించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా రాష్ట్ర స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు.దీంతో ఈ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే రియాక్ట్ అయ్యారు.
విద్యార్థునులపై వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. పత్రికలో వచ్చిన వార్తలపై విచారణ జరిపించాలని ఆదేశించామని పేర్కొన్నారు.
ఈ ఘటనపై మూడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని.. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారత మహిళల రెజ్లర్లపై వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో కోరామని గుర్తు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు తెలిసిందని.. దీంతో గంట వ్యవధిలోనే చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
వేధించినట్లు రుజువైతే అధికారిని జైలుకు పంపిస్తాం.. అవసరమైతే ఉరి తీయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ..
Aug 13 2023, 14:34