పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించండి ఢిల్లీలో వేలాది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహా ర్యాలీ: నేషనల్ వైస్ చైర్మన్ కృష్ణ మోహన్
పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించండి
ఢిల్లీలో వేలాది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహా ర్యాలీ
ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను తీవ్రతరం
హామీ లేని జాతీయ పెన్షన్ విధానాన్ని (ఎన్ పీఎస్) రద్దు చేసి నిర్వచించబడిన, హామీ ఇవ్వబడిన పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని వేలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, మాజీ పారా మిలటరీ బలగాలు, పెన్షనర్లు ఢిల్లీలో పెన్షన్ హక్కుల మహా ర్యాలీ నిర్వహించి రాంలీలా మైదానంలో గురువారం భారీ సభ ఎన్ జేసిఏ కన్వీనర్ శివగోపాల్ మిశ్రా అధ్యక్షతన జరిపారు.
జాయింట్ ఫోరం ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపిఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు, ర్యాలీలలో లక్షలాది మంది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, రాష్ట్ర మరియు స్వయంప్రతిపత్త ఉద్యోగులు, టీచర్లు, యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్లు పాల్గొని నో పెన్షన్ స్కీమును రద్దు చేయాలని నినదించారు.
ఎన్ పీఎస్ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నందున ఓపీఎస్ ను పునరుద్ధరించడం న్యాయబద్ధమైన కోర్కె అని
కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) జాతీయ ఉపాధ్యక్షులు వి.కృష్ణ మోహన్ తెలిపారు.
జనవరి 1, 2004 న లేదా ఆ తర్వాత నియమించబడ్డ ఉద్యోగులకు అమలు చేయబడిన ఎన్ పీఎస్ ను ఉపసంహరించుకొని వారందరినీ ఓపీఎస్ పరిధి లోకి తీసుకురావాలని, పి.ఎఫ్.ఆర్.డి.ఏ ని రద్దు చేసి దానిలో ప్రతి నెలా జమ చేయబడ్డ 10 శాతం బేసిక్ పే మరియు డి.ఏ ను జీపిఎఫ్ పధకాన్ని అమలు చేసి దానిలో జమ చేయాలని డిమాండ్ చేశారు.
కాని పి.ఎఫ్.ఆర్.డి.ఏ మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు 2004 నుండి పి.ఎఫ్.ఆర్.డి.ఏ కి అందించిన విరాళాలను తిరిగి పాత పెన్షన్ స్కీమ్‌కి మారాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నాయని వాపోయారు.
పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని, పింఛను బహుమతి కాదని, అది వారి జీవితంలో ఉచ్ఛ స్థితిలో యజమాని కోసం నిరంతరం శ్రమించిన వారికి సామాజిక-ఆర్థిక న్యాయం అందించే సామాజిక సంక్షేమ చర్య అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం తన స్వంత ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వి.కృష్ణ మోహన్ విమర్శించారు.
సీ.ఆర్.పీ.యఫ్, సీ.ఐ.యస్.యఫ్, ఐ.టి.బీ.పి, యస్.యస్.బీ, ఎన్.ఎస్.జీ, అస్సాం రైఫిల్స్ మొదలైన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీ.ఏ.పి.యఫ్ లు) సిబ్బంది అందరూ పాత పెన్షన్ స్కీమ్‌కు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సీ.ఏ.పి.యఫ్ లకు కూడా ఓపీఎస్‌ని అమలు పరచటానికి తిరస్కరించటం శోచనీయమన్నారు.
ఎన్.పీ.ఎస్ కు అనుకూలంగా కొద్దిమంది ఆర్థికవేత్తలు మరియు ఒక వర్గం మీడియా చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమన్నారు.అనేక దేశాల్లో పెన్షన్ నిధులు కుప్పకూలాయని, పెన్షనర్లు నష్ట పోయారని, భారత దేశంలో కూడా ఎన్.పీ.ఎస్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, షేర్ మార్కెట్ పతనమైతే పెన్షన్ ఫండ్ దివాళా తీస్తుందని గుర్తు చేశారు.
ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నదనీ, సామాజిక రంగానికి మరియు వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని, పెన్షన్ ఫండ్లను ప్రైవేటీకరిస్తున్నదని తెలిపారు.
ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పీ.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకే కాక దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఎన్. పీ.ఎస్ పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదని, వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు, దీర్ఘ కాలంగా అపరిష్కృతంగానున్న ఇతర సమస్యల పరిష్కారానికై ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను వెంటనే తీవ్రతరం చేస్తామని వి. కృష్ణ మోహన్ హెచ్చరించారు.
Aug 12 2023, 19:13