గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా? లేనట్లేనా ❓️
వాయిదా వేయాలంటూ టీఎస్‌పీఎస్సీ ముట్టడికి అభ్యర్థుల యత్నం
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్షలు జరుగుతాయన్న అభిప్రాయాన్ని టీఎస్ పీఎస్సీ అధికారులు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరీక్షలను వాయిదా వేస్తే.. మళ్లీ ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు.
గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న అభ్యర్థనపై టీఎ్‌సపీఎస్సీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా.. రాబోయే రోజుల్లో అనేక ఇతర పరీక్షలు ఉండటంతోపాటు దసరా సెలవులు, అనంతరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వంటి వాటితో ఈ పరీక్షలను ఇక నిర్వహించడం కష్టమన్న వాదన ఉంది. ఒకవేళ, వాయిదా వేయాలంటే తిరిగి అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో సుమారు 783 ఖాళీ గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం డిసెంబరులో నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం సుమారు 5.51 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పరీక్షలను ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ఫిబ్రవరిలో ప్రకటించింది.
ఈ మేరకు మిగిలిన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా రూపొందించింది. ఇందులో భాగంగా, ఈ నెల్లోనే గురుకులాల్లో భర్తీ చేసే కొన్ని పోస్టుల పరీక్షలు కూడా ఉన్నాయి. దాంతో గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీఎ్‌సపీఎస్సీ అధికారులకు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. తాజాగా టీఎ్‌సపీఎస్సీని ముట్టడించారు.
టీఎస్ పీఎస్సీ ముట్టడి యత్నం.. ఉద్రిక్తత
గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ వివిధ జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన అభ్యర్థులు కదం తొక్కారు. గురువారం ఉదయాన్నే అకస్మాత్తుగా టీఎ్‌సపీఎస్సీని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
కానీ, భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాలుగు వైపుల నుంచి దూసుకొచ్చిన అభ్యర్థులను విడతలవారీగా నిలువరించి ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, అభ్యర్థుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అనంతరం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు.
గ్రూపు-2 పరీక్షలు మూడు నెలల వాయిదా వేయాలని, సిలబస్ భారాన్ని తగ్గించాలని నినాదాలు చేశారు. ఏడేళ్లుగా గ్రూపు-2 పరీక్షలు గుర్తుకురాలేదని, ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం హడావిడిగా వరుసగా పలు పోటీ పరీక్షలు నిర్వహిస్తోందని, దీనివల్ల ప్రిపరేషన్‌కు ఇబ్బందిగా ఉందని.. తక్షణమే గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
టీఎస్ పీఎస్సీ చైర్మన్ వచ్చి స్పష్టమైన హమీ ఇచ్చేవరకు కదిలేది లేదన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వారికి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మూడు నెలలు గ్రూపు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికితే కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పాలకులు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్‌ను మఫ్టీ పోలీసులు అతని కోచింగ్ సెంటర్‌లో అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని, NSUI అధ్యక్షుడు వెంకట్‌ను అరెస్ట్ చేశారని, విద్యార్థుల పక్షాన ప్రజాస్వామిక పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టులు చేయడం అక్రమమని విమర్శించారు. విద్యార్థుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు......
Aug 12 2023, 12:10