ViZag: పవన్.. ఈ 10ప్రశ్నలకు సమాధానం చెప్పండి: మంత్రి అమర్నాథ్
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ఈనెల 10 నుంచి విశాఖలో జరగనుంది. ఈనేపథ్యంలో వారాహి యాత్ర లక్ష్యంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు.
విశాఖ సర్క్యూట్ హౌస్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్.. జగన్‌ను తిట్టడానికే విశాఖ వస్తున్నారని విమర్శించారు.
''బ్రో సినిమా మొదటి రోజు కలెక్షన్స్ లేవు. పవన్ లాగా రీల్ హీరో కాదు.. రియల్ హీరో జగన్. అనకాపల్లిలో సెక్షన్ 30 ఎప్పుడూ అమల్లో ఉంటుంది. విసన్న పేటలో 600 ఎకరాలు కబ్జా చేశామని నా మీద ఆరోపణలు చేశారు.. నాకు సెంటు భూమి కూడా లేదు. అత్తారింటికి దారేది అంటే.. విశాఖ, ముంబయి, రష్యా గుర్తుకు వస్తాయి.
విసన్నపేటకు పవన్ కల్యాణ్ వస్తే నాకు అభ్యంతరం లేదు. విశాఖకు ఈ దసరాకి ముఖ్యమంత్రి కానుక ఇస్తారు'' అని మంత్రి అమర్నాథ్ తెలిపారు. విశాఖ, ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయంపై నిలదీయడానికి ప్యాకేజీ స్టార్ వస్తున్నారట అంటూ పవన్‌కి పది ప్రశ్నలు సంధించారు. విశాఖ వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి అమర్నాథ్ ప్రశ్నలివే...
ఏం సాధించారని వారాహి యాత్ర చేస్తున్నారు? ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి?
విశాఖలో మీ పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్పండి?
175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ చెప్పాలి?
జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడి పేరు చెప్పాలి?
విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పుడు స్వాగతిస్తున్నామని పవన్ చెప్పలేదు. తెదేపా స్టాండే.. జనసేన స్టాండ్.
భాజపాతో పొత్తు ఉన్నా విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పవన్ అడ్డుకోలేదు.
జనసేన పార్టీ భాజపాతో సంసారం, తెదేపాతో సహజీవనం చేస్తోంది.
ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అన్నారు.. ఇప్పుడు లడ్డూలు తీయగా ఉన్నాయా?
ఉద్దానంలో ఆసుపత్రి నిర్మిస్తే కనీసం సీఎం జగన్‌ను అభినందించలేదు?
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలి.
పుంగనూరు ఘటనలో 45 మంది పోలీసు అధికారులకు గాయాలు అయ్యాయి.. పోలీసు కొడుకుని అని చెప్పుకునే పవన్ స్పందించాలి
అని మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు..
Aug 10 2023, 10:07