విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని ఎంఈఓ కు వినతి
నల్లగొండ జిల్లా, దేవరకొండ: సమస్యలు పరిష్కారం చేయకుండా 'విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు, మీడియా రావొద్దని' నోటిసులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ మండల విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటీకీ యూనిఫామ్ ఇవ్వలేదు, ఆశ్రమ పాఠశాలలో, కెజిబివిలలో పాఠ్యపుస్తకాలు రాలేదు. మధ్యాహ్నం భోజనం నిధులు లేవు, టీచర్ పోస్టులు భర్తీ లేదు. ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సమస్యలు గురించి తెలుసుకొని పోరాడేవారిని రావోద్దని ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు.
కేజీబీవి, మోడల్ పాఠశాలలో కనీసం టీచర్లు, లెక్చరర్స్ లేక ఇబ్బందులు పడుతున్నారనీ, జిల్లాలో కేజీబీవి పాఠశాలలో ఉండాల్సిన సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయరు, కానీ నిర్బందాలు పెట్టి పోరాడే వారిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ అన్నారు.
రాష్ట్రంలో 24 వేల టీచర్స్ పోస్టులు భర్తీ లేదు, 30 లక్షల మందికి మధ్యాహ్న భోజనం నిధులు పెంచలేదు, కెజిబివిలలో సరైన సదుపాయాలు కల్పన ఉండదు, టాయిలెట్స్, బాత్ రూమ్స్ నిర్మాణం ఉండదు. "మన ఊరు-మన బస్తీ-మన బడి" పేరుతో వచ్చిన నిధులు గుత్తేదారులు యధేచ్చగా బిల్లులు పెట్టి దోచుకుంటుటే చోద్యం చూశారు, తప్ప కనీసం విచారణ లేదని ప్రశ్నించారు. విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన తక్షణమే మన ఊరు, మనబస్తీ, మన బడి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇలానే నోటిసులు ఇచ్చి, సర్య్కూలర్స్ జారీ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం సాధించేవారమా, మరి తెలంగాణ వచ్చిన తర్వాత అప్రజాస్వామిక చర్యలు ఎందుకు అని, తక్షణమే ఈ చర్యలు విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోందని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రామావత్ లక్ష్మణ్, దేవరకొండ మండలం కుర్ర రాహుల్, మూడవత్ వినోద్, శ్రవణ్, చందు తదితరులు పాల్గొన్నారు
Aug 04 2023, 17:53