ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్
ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులను కోరారు. మంగళవారం ఉదయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రెటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా తీసుకోని విధంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉన్నదని నేతలకు కేటీఆర్ చెప్పారు.
ఇటీవల 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న మానవీయతను చాటి చెబుతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ నాయకులను కేటీఆర్ కోరారు. అంతేగాక ఒకటి రెండు రోజుల్లో వీఆర్ఏల కుటుంబాలతోను, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతోను ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు కేటీఆర్ సూచించారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అనాథలు అందరినీ ఒక పాలసీ కిందకు తీసుకువచ్చి, వారి బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా చేసిన నిర్ణయం కూడా అత్యంత మానవీయమైన పరిపాలనా నిర్ణయమని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలో 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు. మెట్రో సేవలు అందుబాటులోకి రానున్న నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నారు.
మెట్రో విస్తరణతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, దాంతో నగర విస్తరణ వేగంగా జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల వలన ఇబ్బందుల పాలైన ప్రజలకు ఉపశమనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా రూ.500 కోట్లు ప్రకటించిందని, ఇవి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.
Aug 03 2023, 07:47