తెలంగాణలో గెరువిచ్చిన వాన
రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొన్నది.
ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నదని వివరించింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం అధికంగా ఉన్నదని, మరో అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి.
మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వానలు పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం నుంచి మూడు రోజులపాటు సాధారణ వాతావరణం ఉంటుందని ప్రకటించింది. రాష్ట్రంలో 10 రోజుల ముందు వరకు 54 శాతం లోటు వర్షపాతం నమోదవగా, శుక్రవారం నాటికి 65 అధిక వర్షపాతం రికార్డయ్యింది. గడిచిన 24 గంటల్లో 24 చోట్ల 60 శాతానికి పైగా, రెండు చోట్ల 20 నుంచి 59 శాతం, ఒక చోట సాధారణ, 6 చోట్ల లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది..
Jul 30 2023, 10:33