విఆర్ఏల సర్దుబాటుపై సీఎం సమీక్ష
గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)లను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వీఆర్ఏల సర్దుబాటుపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు.
ఉన్నతాధికారులు, వీఆర్ఏ ఐకాసతో ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నీటిపారుదల సహా ఇతర శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసే విషయమై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వీఆర్ఏల సర్దుబాటుపై ఈ నెల 11న జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది.
వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జులై 10న నిర్వహించిన సమీక్షలో అధికారులకు చెప్పారు. ఇందుకోసం కేటీఆర్ నేతృత్వంలోని ఉపసంఘం... వీఆర్ఏలతో చర్చలు ప్రారంభించాలని తెలిపిన విషయం తెలిసిందే. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకొని వీఆర్ఏల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఉపసంఘం కసరత్తు పూర్తయి నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.
Jul 24 2023, 11:01