DVK: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేసిన గ్రామపంచాయతీ కార్మికులు
నల్లగొండ జిల్లా, దేవరకొండ: గ్రామ పంచాయతీ కార్మికులు గత 13 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు నల్ల వెంకటయ్య, జేఏసీ కార్యదర్శి యజ్ఞ నారాయణ, ఏఐటియూసీ జిల్లా అద్యక్షులు నూనె రామస్వామి అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు నేడు దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలలో పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారో బార్లు, బిల్ కలెక్టర్లు గా తదితర విభాగాలలో గత 20 నుండి 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని వీరు నర్సరీలు, వైకుంఠధామాలు, పార్కులు, ఆఫీసు పరిసరాలు తదితర ప్రాంతాలలో పనులు నిర్వహిస్తూ, తమ ఆరోగ్యాలను సైతం చెడగొట్టుకొని ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమిస్తున్నారని ఇలాంటి కార్మికులకు రాష్ట్రంలో కనీస వేతనాల జీవోలు సైతం అమలు కావటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కార్మిక చట్టాలైనటువంటి కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, పండగ, జాతీయ ఆర్జిత సెలవులు లాంటి ఏ హక్కుల్ని కార్మికులు నోచుకోకపోవడం అన్యాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, జే. వెంకట్రాములు, ఏ. మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అద్యక్షులు వి. ఆంజనేయులు, సీఐటీయూ ఎన్. నాగరాజు, లక్ష్మణ్, శ్రీను, జేఏసీ నాయకులు సతీష్, జి. కొండల్, అయోధ్య, వీరయ్య, సైదులు, జవహర్ లాల్, పండ్ల అంజమ్మ, ఎర్ర వెంకటమ్మ, గణేష్, బొజ్య, దేవరాజ్, యాదయ్య, భారతి, లలిత, రాములమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Jul 19 2023, 17:39