ఇది మరో ఉద్యమం.. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌పై తెలంగాణ రైతాంగం పోరాటం..
★ రైతు యుద్ధ వేదిక
★ 3 గంటలు నశించాలి..
3 పంటలు వర్ధిల్లాలి
★ గాంధీభవన్‌లో గాడ్సే
★ టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరెస్సెస్ ఏజెంట్
★ ఎమ్మెల్యేలను కొనటంలో సిద్ధహస్తుడు
★ బాబు కనుసన్నల్లోనే తెలంగాణ కాంగ్రెస్
★ రాహుల్‌గాంధీకి ఎడ్లు తెల్వదు..
వడ్లు తెల్వదు
★ హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదు
★ ప్రతి బడిని కేసీఆర్ సర్కారే బాగుచేస్తున్నది
★ జగిత్యాలలో మీడియాతో మంత్రి కేటీఆర్
★ నేటి నుంచి రైతు సభలు
★ కాంగ్రెస్ రైతు వ్యతిరేక
విధానాలపై తీర్మానాలు
★ రేవంత్ తీరుపై నిరసన
ఇది మరో ఉద్యమం.. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌పై తెలంగాణ రైతాంగం పోరాటం.. సాగుకు మూడు గంటల కరెంటు చాలన్న హస్తం పార్టీ కుట్రలను ఎండగట్టేందుకు రైతు వేదికలు సిద్ధమయ్యాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు రైతు సభలు నిర్వహించనున్నారు. ‘మూడు పంటలు బీఆర్‌ఎస్ నినాదం-మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం’ పేరుతో పది రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పనున్నారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యిమంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
బషీర్‌బాగ్‌లో రేవంత్ గురువు చంద్రబాబు రైతులపై కాల్పులు జరపగా, రేవంత్ ప్రస్తుత పార్టీ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా ముదిగొండలో ఇండ్ల స్థలాలు అడిగినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించిన ఘటనలు ఇంకా కండ్ల ముందే మెదులుతున్నాయి. ఆ నాటి దుస్థితి రావొద్దని రైతన్నలు రేవంత్‌పై, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీపై యుద్ధానికి దిగుతున్నారు.
ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ అదే పనిచేస్తున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడిన మాటలు వ్యవసాయంపై కాంగ్రెస్ నేతల అవగాహన లేమికి నిదర్శనమని మండిపడ్డారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎల్ రమణను పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీ కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టేవిధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీల చేసుకోవాలని కోరారు. ఆరు గంటలపాటు కరెంట్ ఇస్తానన్న కాంగ్రెస్, ఏనాడైనా మూడుగంటల పాటైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు. ఎండకాలం వచ్చిందంటే ఎండిన పంటలు, సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు నిత్యకృత్యమయ్యేవని గుర్తుచేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేస్తూనే.. మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేశామని చెప్పారు.
తెలంగాణలో ఉన్నట్టు ఏ రాష్ట్రంలో అయినా 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని మండిపడ్డారు. ‘మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ చాలు అన్న రేవంత్‌రెడ్డి మాటలే కాంగ్రెస్ విధానమా? నా నోటి నుంచి ఏది వస్తే అదే వేద వాక్కు, అదే కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ వేరు కాదు, నేను గీసిందే గీత, రాసిందే రాత అని అమెరికాలో రేవంత్ చెప్పింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో రైతాంగం మూడు పంటలు పండించడమే సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ నినాదమైతే, మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం. ఇందులో ఏది శ్రేయస్కరం? ఏది తెలంగాణకు, రైతులకు మంచిది? అనేది రైతులు ఆలోచన చేయాలి. మరోసారి కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా?, 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణ కావాలా? రైతుబంధు తెచ్చిన కేసీఆర్‌ను విశ్వసిద్ధామా? ఐదు దశాబ్దాల పాటు రైతులను రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్‌ను నమ్ముదామా?’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాల పుణ్యమా అని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లు ఎదురుపోతున్నాయని అన్నారు.
రాహుల్‌గాంధీకి వ్యవసాయం తెలుసా?
---------------------------------------------
కాంగ్రెస్ నేతలు తెల్లారి లేస్తే నోటికొచ్చిన మాటలు, కారు కూతలు కూస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అంటున్నారు. ఆయనకు ఎడ్లు తెలువదు, వడ్లు తెలువదు. క్లబ్బులు, పబ్‌లు మాత్రమే తెలుసు. ఎడ్లు, వడ్లు తెలువనోడు ఇక్కడికి వచ్చి డిక్లరేషన్ అంటూ ఏదో చదివారు. రాహుల్‌గాంధీ లీడర్ కాదు.. రీడర్. ఏం రాసిస్తే అదే చదివారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుంది? అందుకే రాహుల్‌గాంధీని దేశంలో ఏమంటారో అందరికీ తెలుసు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగితే ఈ నీళ్లు ఎలా వస్తున్నాయి. వరద కాలువలో 122 కిలోమీటర్ల పొడవునా నిండుకుండలా నీళ్లు పొంగిపొర్లుతున్న విషయం వాస్తవం కాదా? ఎస్సారెస్పీలోకి పైనుంచి నీళ్లు రాకుంటే ఈ రోజు దిగువ నుంచి కాళేశ్వరం ద్వారా ఎగువకు నీటిని తరలించి ప్రాజెక్టును నింపుతున్నది వాస్తవం కాదా? మార్గమధ్యలో 68 చెరువులను నింపిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాలేదా? ఎస్సారెస్పీ ఆయకట్ రైతులకు ఈ విషయం తెలియదా? వానలు పడకుండానే ఈ నీళ్లు ఎక్కడినుంచి వస్తున్నాయి?’ అని ప్రశ్నించారు.
ప్రజా క్షేత్రంలో తేల్చుకొందాం
--------------------------------------------
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ నిజరూపాన్ని నగ్నంగా బయటపెడుతామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ‘ప్రజాక్షేత్రంలో చర్చపెడ్దాం.. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన కరెంట్ కావాలా? నేడు కేసీఆర్ ఇస్తున్న కరెంట్ కావాలా? అని అడుగుదాం. దాని ఆధారంగా ఓట్లు అడుగుదాం. మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్టార్టర్లు కాలిపోయే కరెంటు మళ్లీ కావాలా? అర్ధరాత్రి పోయి బాయికాడ పడుకొనుడు, పాముకుట్టుడు, తేలుకుట్టుడు, మనుషులు చచ్చుడు కావాలా? కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంట్ కావాలా? అని ప్రజలను అడుగుదాం. చైతన్యవంతమైన తెలంగాణ రైతులు తప్పకుండా తీర్పు చెప్తారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నది రాజకీయ సమస్య కాదని, రైతుల సమస్య అని అన్నారు. ‘కేసీఆర్ పాలన, వ్యవసాయ విధానం బాగున్నాయని మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రైతులు చెప్తున్నారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ అంటే, మహారాష్ట్ర రైతన్న గొంతు కలుపుతున్నాడు. మరి ఇక్కడున్న కాంగ్రెస్ సన్నాసి పార్టీకి ఏమైంది? రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, ఊరూరా కొనుగోలు కేంద్రం వంటి పథకాలు మంచిగున్నాయని ఇతర రాష్ర్టాలు అంటుంటే, ఇక్కడి భావ దారిద్రపు ప్రతిపక్షం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? రైతులకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పేదాక ఉద్యమిస్తాం. తెలంగాణ ఉద్యమం నాటి స్ఫూర్తిని ప్రదర్శిద్దాం. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదిరోజుల పాటు రైతాంగాన్ని చైతన్యవంతం చేయాలి. రాష్ట్రంలోని 2,603 రైతు వేదికల్లో కదం తొక్కాలి’ అని పిలుపునిచ్చారు.
గాంధీ భవన్‌లో గాడ్సే
-----------------------------------
రేవంత్‌రెడ్డి నేపథ్యం తెలిసిన వారందరికీ అతడు ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్ అన్న విషయం స్పష్టంగా తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ కాంగ్రెస్ నడుస్తున్నదని, కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చినవారేనని పేర్కొన్నారు. ‘రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ కార్యకర్త. ఆయన పీసీసీ అధ్యక్షుడు అయినప్పటినుంచి నేటివరకు ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణకు రావాల్సివాటిపై ప్రశ్నించిన పాపాన పోలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌తో రేవంత్‌కు ఉన్న అనుబంధాన్ని తెలిపే పాత వీడియోలు కూడా ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌వాళ్లు కనబడితే ఇప్పటికీ కాళ్లు మొక్కుతాను అన్న రేవంత్ వీడియోలన్నీ ఉన్నాయి. ఈ రోజు కొత్తగా వచ్చి బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ అంటూ నోటికొచ్చినట్టు వాగతున్నారు. రేవంత్‌రెడ్డి పూర్వాశ్రమం అంతా ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లోనే కాదా? ఢిల్లీ గవర్నమెంట్ హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే, బీజేపీకి వంతపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదా?’ అని ఆయన ప్రశ్నించారు.
26 వేల పాఠశాలలు ఆధునీకరణ
-------------------------------------------
కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లలో ఏ పనీ చేయకుండా వదిలిపెట్టి పోతే, జగిత్యాలను జిల్లా కేంద్రం చేసి, ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. అన్ని పాఠశాలల సుందరీకరణ పూర్తయిన తర్వాత కంటివెలుగు శిబిరాలు పెట్టి కాంగ్రెస్ నాయకులు జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డికి అద్దాలు ఇచ్చి ఎంతబాగా పని జరిగిందో చూపెట్టే బాధ్యత సైతం తమదేనని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, గుండు సుధారాణి, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతు విధానాలే ఎజెండాగా ప్రజల వద్దకు వెళ్దాం
--------------------------------------------
రైతు ప్రయోజనాలు అనే సింగిల్ ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్దామని కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంట్ కావాలా? కేసీఆర్ ప్రస్తుతం ఇస్తున్న కరెంట్ కావాలా? అని ప్రజలను అడుగుదాం. తిమ్మిని బమ్మిని చేయడంలో, ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్‌రెడ్డి సిద్ధహస్తుడు. కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌లోకి గాడ్సేగా చొచ్చి ఈ రోజు ఆ పార్టీని నడుపుతున్నారు. అలాంటి చోట లాగ్‌బుక్‌ల గురించి మాట్లాడటం కాదు, వాళ్లు దేన్నైనా మార్చగలరు. అందుకే రైతుల వద్దకే వెళ్లి అడుగుదాం. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకొందాం. రాష్ట్రంలోని 70 లక్షల రైతులు రూ.73 వేల కోట్లు రైతుబంధు రూపంలో పొందారు. వారిని తీర్పు ఇవ్వమని కోరుదాం’ అని సవాల్ విసిరారు. విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద కాంగ్రెస్ పార్టీని రైతులు, ప్రజలు తన్ని తరిమివేస్తే ఆ బాధ్యత తమది కాదని మంత్రి స్పష్టంచేశారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరు
------------------------------------------
కాంగ్రెస్ పార్టీ రైతులకు క్షమాపణలు చెప్పాలని సోమవారం నుంచి రాష్ట్రంలోని ప్రతి రైతువేదికలో వెయ్యిమంది రైతులతో తీర్మానం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతులను, వ్యవసాయాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ రైతు వేదికకు వచ్చి తీర్మానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ కటిక చీకట్ల కాలం వద్దు, 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనే ముద్దు.. మూడు గంటల వ్యవహారం వద్దు, మూడు పంటల విధానం కావాలి’ అని తీర్మానం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని ఎండగడుతూ పదిరోజులపాటు ప్రతి నియోజకవర్గంలోని రైతువేదికలో తీర్మానం చేయాలని కోరారు. గ్రామ రైతు వేదికలు తీర్మానం చేసి మండల రైతు సమాఖ్యకు, వారు జిల్లా రైతు సమాఖ్యకు, వారు రాష్ట్ర రైతుబంధు సమితికి పంపించాలని సూచించారు. రాష్ట్రంలో ఉచిత కరెంట్‌పై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉచిత కరెంట్ తెచ్చిన మాట నిజం. మరి నేడు రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? ప్రస్తుతం ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ తప్ప, రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ కాదు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడో ఆంధ్రాకు తీసుకుపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. చంద్రబాబు వ్యవసాయం దండుగ అంటే, ఆయన శిష్యుడు.. చోటా చంద్రబాబు అదే లైన్‌లో మూడు గంటల కరెంట్ చాలు అంటూ ముక్కు విరుస్తున్నారు. తెలంగాణ రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులారా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మీది కాదు.. ఇక్కడి కాంగ్రెస్ చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే కాంగ్రెస్. ఆర్‌ఎస్‌ఎస్ చెప్పుచేతల్లో నడిచే కాంగ్రెస్. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి’ అని సూచించారు.
కరెంటు అడిగితే కాల్చి చంపారు..
--------------------------------------------
కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనకు దిగినవారిపై కాల్పులకు దిగి ముగ్గురిని బలిగొన్నది నాటి చంద్రబాబు సర్కార్. 2000 ఆగస్టు 28న వామపక్షాల ఆందోళనకు భారీగా రైతులు, యువకులు తరలివచ్చారు. బషీర్‌బాగ్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. అలాంటి చంద్రబాబు శిష్యుడు ఇప్పుడు కరెంటు మూడుగంటలే చాలంటూ మళ్లీ రైతుల గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నారు.
భూమి అడిగితే బుల్లెట్ దించారు..
------------------------------------------
ఇండ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ పేదలు చేసిన ఆందోళనపై కర్కశంగా వ్యవహరించింది.. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2007 జూలై 28న ఖమ్మం జిల్లా ముదిగొండలో నిరసనపై బుల్లెట్ల వర్షం కురిపించింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏడుగురిని పొట్టనబెట్టుకున్నది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్.. ఉచిత విద్యుత్తుపై విషం కక్కుతున్నారు. పేద రైతుల నోట్లో మట్టిగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Jul 17 2023, 16:31