ప్రపంచ స్థాయి పరిశ్రమలకు కేరాఫ్ తెలంగాణ: మంత్రి కేటీఆర్
★ ప్రపంచస్థాయి పరిశ్రమలకు
కేరాఫ్ తెలంగాణ
★ రాష్ట్రంలో పెట్టుబడులకు జపాన్
కంపెనీల ఆసక్తి: మంత్రి కేటీఆర్
★ చందనవెల్లిలో నికోమాక్, దైఫుకు
పరిశ్రమలకు శంకుస్థాపన
★ జపాన్ కంపెనీలతో క్లస్టర్ ఏర్పాటు
చేయాలని రాయబారికి వినతి
★ 2 వేల ఉద్యోగాలు.. పరోక్షంగా మరో
4 వేల మందికి ఉపాధి
ప్రపంచ పారిశ్రామిక రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇస్తున్న అనుమతులతో ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లిలో రూ.576 కోట్లతో ఏర్పాటుకానున్న జపాన్‌కు చెందిన దైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నికోమాక్ తైకిష క్లీన్ రూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. చందనవెల్లిలో ప్రత్యేకంగా జపాన్ కంపెనీలతో క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని భారత్‌లో జపాన్ రాయబారిని కోరారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. జపాన్ భాషలో ఆశీర్వచనంగా వాడే ‘ఇనీ ఆరాటా’ పదాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా వివరించారు. ఇనీ అరాటా గతంకంటే భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించటమని, రాష్ట్రంలో ఏర్పాటు కానున్న కంపెనీలు కూడా అలాగే ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. జపాన్ కంపెనీల కచ్చితత్వం, పనితీరు మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్దిష్ట సమయంలో కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని, భవిష్యత్తులో కూడా ఇంతే ప్రభావవంతమైన పనితీరును కనబరుస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఫ్యాక్టరీలను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.
జపాన్ కంపెనీల కోసం ప్రత్యేక క్లస్టర్
----------------------------------------------
127 మిలియన్ల జనాభా ఉన్న జపాన్ దేశానికి ప్రకృతి వైపరీత్యాలు పదేపదే సవాళ్లు విసిరినప్పటికీ ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగటం ప్రశంసనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మనదేశంలో ఎవరి ఇంట్లో చూసినా జపాన్‌కు చెందిన ఏదో ఒక వస్తువు ఉంటుందని, జపాన్ ఉత్పత్తులపై ఇక్కడి ప్రజలకు ఉన్న గౌరవం అలాంటిదని తెలిపారు. జపాన్‌కు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలని మంత్రి సూచించారు. జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ రాయబారికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని, ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోనే కీలకంగా చందనవెల్లి పారిశ్రామిక వాడ
---------------------------------------------
విస్తారంగా ఏర్పాటవుతున్న పరిశ్రమల స్థాపనతో చందనవెల్లి పారిశ్రామిక వాడ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఎదుగుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. టెక్స్‌టైల్స్ మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాల వరకు విభిన్నమైన కంపెనీలు చందనవెల్లినే కేంద్రంగా ఎంచుకొంటున్నాయని తెలిపారు. దైఫుకు, నికోమాక్ తైకిష కంపెనీలు పెడుతున్న రూ.576 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా 1600 నుంచి 2 వేల వరకు ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకొని యువతకు శిక్షణ ఇచ్చి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని రెండు కంపెనీలు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనిత హరినాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, దైఫుకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గరిమెళ్ల, నికోమాక్ తైకిష కంపెనీ ఎండీ తకుయ మోరిసన్, కౌన్సిల్ జనరల్ మసయుకి టగసన్, దైఫుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నావ్‌యుకి ఆండౌ తదితరులు పాల్గొన్నారు.
Jul 16 2023, 10:50