ఈ నెల 27న ఛలో ఈ.ఎన్.సి కార్యలయం: పల్లా దేవేందర్ రెడ్డి పిలుపు
నల్లగొండ జిల్లా, పానగల్: మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈ ఎన్ సి కార్యాలయం ముందు జరిగే ధర్నాను, జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్మికులు సుమారు 16 వేల మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికి త్రాగునీరు ఇవ్వాలనే మిషన్ భగీరథ విజయవంతం కావడానికి కార్మికులు తీవ్ర శ్రమ చేస్తున్నప్పటికీ వారి శ్రమకు తగ్గ వేతనాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్లు ఇవ్వకుండా కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నారని దేవేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక ఆద్వర్యంలో ఈ నెల 27 ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇఎన్‌సి) కార్యాలయం, ఎర్రమంజిల్, హైదరాబాద్ వద్ద తలపెట్టిన ముట్టడి కార్యక్రమం సందర్భంగా, నల్లగొండలోని పానగల్ వాటర్ ప్లాంట్ వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు, మిషన్ భగీరథ పేరుతో పథకాన్ని ప్రారంభించటం జరిగిందని, దీని అమలుకు పెద్ద కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులను ఇవ్వటం జరిగిందని, ఈ కాంట్రాక్టర్లు కార్మికుల శ్రమను దోచుకొంటూ అతి తక్కువ జీతాలు ఇస్తున్నప్పటికీ, కనీస వేతనాలు, కార్మిక హక్కులు అమలు కాకున్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శోద్యం చూస్తున్నారని వారు విమర్శించారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం.60 ని విడుదల చేసి స్కిల్డ్ కార్మికులకు రూ.22,750/-, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.19,500/-, అన్ స్కిల్డ్ కార్మికులకు రూ.15,600/-, అమలు చేస్తున్నప్పటికీ మిషన్ భగీరథలో మాత్రం కాంట్రాక్టర్లు కన్‌ష్ట్రక్షన్ పేరుతో కార్మికులకు అన్యాయం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు నిర్వహించినా, లేబర్ అధికారుల వద్ద కాంట్రాక్టర్లు కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి వాటిని అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని వారు అన్నారు.
అధికారులు, కాంట్రాక్టుర్లు, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలపై స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల 27న ఇ.ఎన్.సి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా నుంచి మిషన్ భగీరథ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి.కృష్ణ ,ప్రధాన కార్యదర్శి ఎం డి జానీ,పాక శ్రీను, ఎన్. నరేందర్, సర్దార్, దయాకర్, ఎడ్ల లింగయ్య, ఎం యాదమ్మ , మంగ, శ్రీనివాస్ రెడ్డి, అజీముద్దీన్, నాగరాజు, విజయ్, మహేష్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.
Jun 27 2023, 21:50