సారూ... మీరు మారిపోయారా❓️
అవును.. సారు మారిపోయారు.. ఎంతలా అంటే బాబోయ్ ఇంతకీ ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనా.. లేకుంటే వేరేనా..? అనేంతలా మారిపోయారు..! ఈయన ప్రసంగం విన్న తెలంగాణ ప్రజానీకం ఒకింత కంగున్నది..!.. ఇక ప్రతిపక్షాలు అయితే నోరెళ్లబెట్టాయి.. గులాబీ బాస్‌లో సడన్‌గా ఇంత మార్పు ఏంటబ్బా..? అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఆలోచనలో పడ్డారు.. ఇందుకు కారణం ఆదివారం నాడు నిర్మల్ బహిరం ఏం మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభలో మాట్లాడినా మాటకు ముందు.. వెనుక బీజేపీని దుమ్మెత్తి పోస్తుండేవారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రతో మొదలుపెట్టిన బహిరంగ సభలు మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించాలని లెక్కలేసుకుని మరీ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన పలువురు కీలక నేతలకు గులాబీ కండువా కప్పారు.. ఇప్పటికే ఒకసారి ఎన్నికలో కూడా పాల్గొన్నారు. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకెళ్తున్న కేసీఆర్.. బీజేపీని విమర్శించడానికి ఏ చిన్న చాన్స్ వచ్చినా సరే అస్సలు వదులుకోరు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సందర్భాల్లో అందరూ గమనించే ఉంటారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్ లాంటి కీలక విషయాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టినెన్స్ విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారు. ఇందుకు కేసీఆర్ మద్దతు కూడా ఇచ్చారు. ఇటీవలే.. హైదరాబాద్ వేదికగా ఈ ఇద్దరు కలుసుకుని మీడియా మీట్ పెట్టి.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంపై తాడోపేడో తేల్చుకునేంత రేంజ్‌లో ఆగ్రహంతో ఊగిపోతూ కేసీఆర్ ప్రసంగించారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు కూడా బీజేపీపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మాట్లాడేవారు. కానీ.. గులాబీ బాస్ ఎందుకో మారిపోయారు.. ఇన్ని బద్ధ శత్రువుగా చూసిన బీజేపీని మిత్రుడిగా చూస్తున్నారు..!
కేజ్రీవాల్- కేసీఆర్ భేటీ జరిగి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు.. ఈ వ్యవధిలోనే సార్ ఎందుకో మారిపోయారు..! ఆదివారం నాడు నిర్మల్‌లో జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో బాస్ మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలు, యథావిధిగా బీజేపీపై విమర్శలు ఉంటాయని బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు.. తెలంగాణ ప్రజానీకం ఆశించింది కానీ.. కేసీఆర్ వింత వైఖరి ప్రదర్శించారు. అరగంటపైగా కేసీఆర్ ప్రసంగించినప్పటికీ ఎక్కడా బీజేపీ ఊసే ఎత్తలేదు. బీజేపీని పూర్తిగా పక్కనెట్టిన కేసీఆర్.. కాంగ్రెస్‌పై విమర్శల దాడికి దిగారు. ఇన్నిరోజులు బీజేపీ అంటే ఒంటికాలిపై లేచిన సారు.. ఇప్పుడు పూర్తిగా పక్కనెట్టేశారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీ పార్టీ పేరు పలకడానికి కేసీఆర్ సాహసించలేదు. అంతేకాదండోయ్.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ శాపనార్థాలు కూడా పెట్టారు. 50 ఏళ్ల పాలనలో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతు బంధుకు రాం రాం... రైతు బీమాకు జై భీమ్ చెబుతారని తెలంగాణ ప్రజలను కేసీఆర్ హెచ్చరించారు. ఇదే సభావేదికగా నిర్మల్ జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు రూ.10 లక్షలు.. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు.. జిల్లాలోని 19 మండలాలకు రూ.25 లక్షల చొప్పున నిధులు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మొత్తానికి చూస్తే.. ఇన్నిరోజులుగా కేసీఆర్ వర్సెస్ బీజేపీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయాయన్న మాట. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అని ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు గాను బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారని పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పాటు ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ బీజేపీ గురించి పొల్లెత్తి మాట కూడా మాట్లాడకపోవడం ఆ అనుమానాలు, ఆరోపణలను నిజం చేసినట్లయ్యింది. ఇన్నిరోజులుగా బీజేపీని దుమ్ములేచిపోయే రేంజ్‌లో తిట్టిన కేసీఆర్ సడన్‌గా ఇలా మారిపోవడం వెనుక ఏం జరిగిందో.. ఏంటో మరి..!
Jun 05 2023, 09:24