చోర కళ నేర్పుతారిక్కడ
ఆ బడిలో పాఠాలు మంచి బుద్ధులు బోధించరు. దొంగతనం ఎలా చేయాలి దోపిడీలకు ఎలా పాల్పడాలి ఒకవేళ దొంగతనం చేస్తుండగా పట్టుబడితే చాకచక్యంగా ఎలా తప్పించుకోవాలి అనే చోరకళ నేర్పిస్తారు.
కడియా, గుల్‌ఖేడి, హుల్‌ఖేడి... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 117 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామాలవి. చీకటి పడగానే ఆ ఊళ్లలో పిల్లలందరూ భుజాన బ్యాగులు తగిలించుకుని గబగబా బడికి పరుగులు తీస్తారు. అయితే వాళ్లు వెళ్లేది ఏ నైట్ స్కూల్‌కో అనుకునేరు... చేతిలో పెన్ను, పుస్తకం పట్టుకోవాల్సిన వయసులో కత్తెర, బ్లేడు, స్ర్కూడైవర్‌తో దొంగల బడిలో అడుగుపెడుతున్నారు. దొంగతనం, దోపిడీ వంటి చోరకళలో నిష్ణాతులవుతున్నారు.
దొంగలబడిలో విద్య ఉచితంగా నేర్పుతారనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆయా ఊళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలకు 12 ఏళ్లు రాగానే రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల అడ్మిషన్ ఫీజు చెల్లించి మరీ చేర్పిస్తున్నారు. ఒక దొంగల ముఠా ఏడాదికాలం కోర్సుతో ఈ బడిని నడుపుతోందట. ఇంతకీ అక్కడ ఏం నేర్పుతారంటే... రద్దీ ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి? బ్యాగులు ఎలా లాక్కోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? వేగంగా పరిగెత్తడం, పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు
ఒకవేళ పట్టుబడితే లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి విషయాల్లో పిల్లల్ని సుశిక్షితులను చేస్తారు. శిక్షణ అనంతరం వారిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించి, వాళ్లు కొట్టుకొచ్చిన సొమ్మును ఆ దొంగల ముఠాయే తీసుకుని, సదరు పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలు పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల బడిలో చేర్పించేందుకు పోటీ పడుతున్నారు.
ఈ బడిలో అడ్మిషన్ పొందాలంటే కొన్ని అర్హతలు కూడా ఉండాలి. అయితే అవి చదువు, మార్కులు, ర్యాంకులో కాదు... కేవలం వయసు. ఇక్కడ చేరాలంటే పిల్లాడి వయసు 12 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్యనే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే అడ్మిషన్ ఇవ్వరు. దీనికో పకడ్బందీ కారణం ఉంది. ఒకవేళ దొంగతనం చేస్తూ కుర్రాళ్లు పట్టుబడితే... మైనర్లనే కారణంతో ఎక్కువ శిక్ష పడకూడదనే ఈ వయసును నిర్ణయించారట.
దొంగలబడి విద్యార్థుల ప్రధాన ఫోకస్ అంతా బడా బాబుల మీదనే ఉంటుంది. కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా వీళ్లు ఎక్కువ చోరీలకు పాల్పడుతుంటారు. వారి ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లకు వెళ్లి... నగలు, డబ్బు, ఖరీదైన వస్తువులు చాకచక్యంగా కొట్టేస్తుంటారు. దొంగిలించిన తర్వాత ఆయా వస్తువులతో వారు తమ స్వగ్రామానికి చేరుకోకముందే ఆ కేటుగాళ్లను పోలీసులు పట్టుకోవాలి. లేదంటే వారు దొరకడం కష్టమే. ఆ ఊళ్లోకి పోలీసులు ఎవరైనా అడుగుపెడితే చాలు... ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఈ గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 2 వేల మందిపై దేశంలోని పలు స్టేషన్లలో ఇప్పటిదాకా 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ గ్రామాల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినా, వారి వద్ద కెమెరాలు, సెల్‌ఫోన్లు ఉన్నట్లు గ్రామస్థులు గమనించినా వెంటనే అలర్ట్ అయిపోతారట. మొత్తానికి అన్ని కళల్లాగే ‘చోర’కళలో శిక్షణ ఇవ్వటం విచిత్రమే కదా
Dec 09 2024, 11:50