పార్టీ మారే యోచనలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణలో మళ్లీ పార్టీ ఫిరాయింపులు మొదలయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుతో కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై హై కోర్టులో అప్పీల్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ కు టైమ్ బాండ్ లేదని తేల్చి చెప్పింది. రీజనబుల్ టైమ్ లోనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వీరు త్వరలో హస్తం గూటికి చేరుతారని పేర్కొన్నారు. ముగ్గురు గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు అని ప్రచారం సాగుతోంది. పార్టీ బలహీన పడితే కష్టమని భావిస్తున్న కేసీఆర్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చర్చలు జరుపుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వీరిలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైతరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చేరికల స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది.
అంతే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ లో బలం పెంచంకునేందుకు గ్రేటర్ కు చెందిన గులాబీ ఎమ్మెల్యేలకు గాలం విసురుతుంది. బీఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి గ్రేటర్ బలం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం పెంచుకుంది. ఇదే తరహాలో కూడా హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. అందుకే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పార్టీ మారే ఎమ్మెల్యేల్లో ఒకరు గొర్రెల పథకంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ఎమ్మెల్యేలకు విద్యాసంస్థలు ఉన్నాయి. వీరిద్దరు పార్టీ మారితేనే సమస్యలు రావని భావిస్తున్నారు.
Nov 25 2024, 19:47