తుంగభద్రకు 33 గేట్లు ఒకేసారి మార్చేయాలి
తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల జీవిత కాలం అయిపోయింది మరమ్మతులతో కాలయాపన చేయడం సరైంది కాదు.
తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల జీవిత కాలం అయిపోయింది. మరమ్మతులతో కాలయాపన చేయడం సరైంది కాదు. మరో క్రస్ట్‌గేటు కొట్టుకుపోదని గ్యారెంటీ ఇవ్వలేం. అత్యాధునిక డిజైన్‌తో 33 క్రస్ట్‌గేట్లు కొత్తగా ఏర్పాటు చేయడమే పరిష్కారం’’ అని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 33 గేట్లు ఏకకాలంలో మార్చడంపై తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు(టీబీపీ బోర్డు) దృష్టి పెట్టింది. ఇలా ఒకేసారి 33 గేట్లు మార్చడం సాధ్యమేనా? ఎంత నిధులు కావాలి? అనే అంశంపై ఆరా తీసింది. దీనికి సంబంధించి డిసెంబరులోగా క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించి, పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) తయారు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు చైర్మన్ పాండే అధ్యక్షతన టీబీపీ బోర్డు పేర్కొంది. శుక్రవారం హోస్పెట్‌లో బోర్డు భేటీ జరిగింది. బోర్డు సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, కర్ణాటక రాష్ట్ర సభ్యుడు కులకర్ణి, బోర్డు ఎస్‌ఈ నీలకంఠారెడ్డి, ఏపీ రాష్ట్ర సభ్యుడి తరఫున అనంతపురం జిల్లా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సీఈ నాగరాజు హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున రిచామిశ్ర, తెలంగాణ సభ్యుడు, ఈఎన్‌సీ అనీల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. జలాశయంలో పూడిక చేరడంతో 30 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయింది. ఆ నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రభుత్వం 31 టీఎంసీలతో నవలీ జలాశయం నిర్మాణానికి ప్రతిపా దిస్తోంది. దీనికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని బోర్డు సమావేశంలో తెలిపింది. డీపీఆర్‌ను అధ్యయనం చేయాల్సి ఉండడంతో నవలీ రిజర్వాయర్‌కు ఏపీ అభ్యంతరం చెప్పింది. రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర వరద జలాలు వినియోగించుకునేలా తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతరంగా మరో కాలువ నిర్మించే తేల్చాలని పేర్కొంది. కాగా, తెలంగాణ ఈ రెండింటినీ వ్యతిరేకించినట్లు సమాచారం.
తుంగభద్ర బోర్డు అకౌంట్ ఫ్రీజ్ కావడంతో ఉద్యోగులు జీతాలు లేకుండా ఎలా పని చేస్తారు? బోర్డు సెక్రెటరీ, ఎస్‌ఈలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే అకౌంట్ ఫ్రీజ్ తొలగించాలి’’ అని పాండే ఆదేశించారు. తుంగభద్ర దిగువ, ఎగువ కాలువల సీసీ లైనింగ్ కోసం రూ.400 కోట్లతో టెండర్లు పిలిచి.. అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన టెండర్ల జీవో(టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసే అధికారం) బోర్డుకు వర్తించదని స్పష్టం చేశారు.
Nov 23 2024, 10:50