తెలంగాణ ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ ఆధ్వర్యంలో ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకలు
తెలంగాణ ములాయం సింగ్ యాదవ్ యూత్ బ్రిగేడ్ రాష్ర్ట అధ్యక్షులు మేకల బాలు యాదవ్ *కాకలుతీరిన యోధుడు నేడు ములాయం 85 వ జన్మదినం* అరవై ఏళ్ళ రాజకీయ జీవితం* ఎన్నికల బరిలో 18 సార్లు* తాతతండ్రులకు పెద్దగా ఆస్తులూ లేవు,చదువసంధ్యలు లేవు. అసలే కులాల సమాజం. అలాగని పెత్తందారీ కులమూ కాదు. దానికి తగ్గట్టుగా రహదారి కూడా లేని చిన్న పల్లెటూరు. ఇదిగో ఈ నేపథ్యంలో సాధారణ యాదవ కుల కుటుంబంలో 85 ఏళ్ళ క్రితం 1939 నవంబరు 22న జన్మించాడు ములాయం సింగ్ యాదవ్. బీసీ కులస్థుడైన ఆయన పుట్టిన ఊరు పేరు ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా జిల్లా సేఫయీ. కనీసం బడి కూడా లేని పల్లె. తండ్రి షుగర్ సింగ్ కు ఐదుగురు కొడుకులు, ఒక కూతురులలో మూలయం మూడో సంతానం. చిన్న వ్యవసాయ కమతం, ఆవులు, గేదెలు వీటి సంరక్షణే ఆ తండ్రి జీవనవృత్తి. పిల్లలు కూడా పశువుల పెంపకంలో కొనసాగాలని ఆయన కోరుకున్నారు. కానీ బాలుడు ములాయం చదువుకుంటానని మారంచేసి విద్యాభ్యాసం చేశాడు. సమీపంలో ఉన్న పట్టణంలో డిగ్రీ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తి చేయాలనే మమకారంతో బీయిడీ చేశాడు. కొద్ది కాలం పాఠాలు కూడా బోధించాడు. విద్యార్థిగా ఉంటూనే కుస్తీ పోటీల్లో పాల్గొని మల్లయోధుడుగా పేరొంది ఎక్కడ పోటీకెళ్ళినా ఆయనే విజేత. 14 ఏళ్ళ వయసులో 1953లో వ్యవసాయ నీటి పన్ను పెంపుదలకు వ్యతిరేకంగా సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చేపట్టిన ఆందోళనలో పాల్గొని అరెస్టయి నెల రోజులు జైల్లో ఉన్నాడు. అదిగో అలా రాజకీయ ప్రజాజీవితంలో ప్రవేశించిన ములాయం సింగ్ యాదవ్ ఇప్పటి వరకూ 11 అసెంబ్లీ ఎన్నికల్లో, 7 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 18 సార్లు పోటీ చేసాడు. 16 సార్లు గెలిచాడు. 1967లో 27 ఏళ్ళ వయసులో తన స్వంత నియోజకవర్గం జశ్వంత్ పూర్ అసెంబ్లీకి తొలిసారి తన రాజకీయ గురువు, మార్గదర్శి రామ్ మనోహర్ లోహియా ప్రోత్సాహంతో ఆయన పార్టీ సంయుక్త సోషలిస్టు పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలిచాడు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళల్లో ములాయమే చిన్న వయస్కుడు. అదే స్థానంలో స్థానంలో రెండు సార్లు 1969,1980 లలో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఏడు సార్లు పోటీ చేసిన లోక్ సభ ఎన్నికల్లో ఏనాడూ ఓటమి లేదు. ప్రస్తుతం ఆయన తన స్వగ్రామం ఉన్న మైనాపురి లోక్ సభ నియోజకవర్గం నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. "సోషలిస్టు సింద్ధాంతం అలవర్చుకుని అది నేర్పిన పోరాట పటిమ ములాయంను ఎప్పుడూ పోటీకి జంకని వ్యక్తిగా తీర్చిదిద్దింది" అని ఆయన కజిన్ బ్రదర్ రామ్ గోపాల్ యాదవ్ ఒక సందర్భంలో అన్న మాట నిజం. అలాగే దంగల్ పోటీల్లో (కుస్తీ) ఎప్పుడూ ప్రత్యర్ధిని చిత్తుచేసే అలవాటు రాజకీయాల్లో కూడా ములాయంను ప్రభావితం చేసింది. ఆరు దశాబ్దాల ములాయం రాజకీయం ఏడు రాజకీయ పార్టీల గుండా గడిచింది. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కడా మత తత్వ పార్టీ వైపు గానీ, సుధీర్ఘ కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ వైపు గానీ మరలలేదు. 1967లో గురువు లోహియా మరణంతో సోషలిస్టు పార్టీ చీలికలు పేలికలైంది. ములాయంకు రాజకీయ నిర్ధేశకత్వం కొరవడింది. ఈ దశలో ఆయన రైతు నాయకుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తర్వాత దేశ ప్రధానిగా పని చేసిన చౌదరీ చరణ్ సింగ్ నాయకత్వంలో పని చేయలని నిర్ణయించుకున్నారు. చరణ్ సింగ్ పార్టీ భారతీయ లోక్ దళ్ తో పాటు పలు పార్టీలు 1977లో ఇందిర ను ఓడించడానికి జనతా పార్టీ గా ఏకమయ్యాయి. 77లో దేశంలో పాటు ఉత్తర ప్రదేశ్ లో కూడా రామ్ నరేష్ యాదవ్ నాయకత్వంలో జనతా పార్టీ విజయం సాధించింది. రామ్ నరేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రి వర్గంలో మొదటి సారి సహకార శాఖా మంత్రి పదవి చేపట్టారు. ఇందిర 1980లో మళ్ళీ ప్రధానై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో జరిగిన ఉపఎన్నికలో ములాయం ఓడిపోయారు. ఇది ఆయనకు రెండో ఓటమి. తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో చరణ్ సింగ్ ప్రోత్సాహంతో ఆయన పోటీ చేసి ఎన్నికై మండలిలో లోక్ దళ్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడి అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు. 1985 యు.పి అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి గెలిచాడు. ఈసారి 425 స్థానాలున్న అసెంబ్లీకి లోక్ దళ్ పార్టీ నుండి 86 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అసెంబ్లీ లో లోక్ దళ్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ములాయం ఎన్నికై ఆ అసెంబ్లీ కాలమంతా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నాయకుడుగా గుర్తింపు పొందారు. బోఫోర్స్ ఉదంతంతో 1989లో ప్రధాని రాజీవ్ ను ఓడించడానికి నాలుగు పార్టీల కలయికతో ఏర్పడిన జనతాదళ్ లో ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ దళ్ కూడా విలీనం అయ్యింది. లోక్ సభ, అసెంబ్లీ కి 89లో ఏక కాలంలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ కేంద్రంలోను ఇటు యు.పి.లో విజయం సాధించింది. ములాయం ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడ్డానికి అవసరమైన మెజారిటీ లేదు. కమ్యూనిస్టుల మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ 24 కోట్ల జనాభాతో దేశంలో అతిపెద్ద ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. జనతాదళ్ ప్రభుత్వం మండల్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి ఆందోళన అనంతర పరిణామాల మధ్య బీజేపీ తన ఎంపీల మద్దతు ఉపసంహరించుకోవటంతో అటు కేంద్రంలో ఇటు యు.పి.లో ప్రభుత్వాలు పడిపోయాయి. తర్వాత 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ములాయం రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. *కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా* 1996లో ములాయం మొదటి సారి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. అది మొదలు గత 2019 వరకూ జరిగిన అన్ని లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి వరసగా విజయం సాధించడం పెద్ద విశేషం. 1996లో కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం కీలకమైన రక్షణ శాఖ మంత్రి పదవి దక్కించుకోవటం విశేషం. 2003 లో మూడో దఫా ములాయం యు.పి ముఖ్యమంత్రి అయ్యారు. చేజారిన ప్రధాన మంత్రి పదవి* బహుశా దేశంలో ఇప్పటి రాజకీయ నాయకులందరికంటే ప్రధాన మంత్రి సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అర్హతలున్న నాయకుడు ఎవరని పరిశీలిస్తే....మొదటి వినిపించే పేరు ములాయం సింగ్ యాదవ్ పేరునే. కోట్ల మంది అభిమానానికి తోడు సుధీర్ఘ 60 ఏళ్ళ పాటు క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనటం, మెజారిటీ ప్రజల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాన్ని వ్యవహరశైలిగా మార్చుకునే స్వభావం, అటు సామాజిక జీవితానుభవం, ఇటు రాజకీయ రంగ అనుభవం, మొత్తంగా ఆయన నేపధ్యం ప్రధాన మంత్రి పదవి కి అర్హతకు ముందుంచుతుంది. ఇలా అన్ని అర్హతలు ఉన్న ఆయనకు ఒక సందర్భంలో ప్రధాని అయ్యే అవకాశం సంపూర్ణంగా ఏర్పడింది. కానీ కొందరి చేసిన వెన్నుపోటు రాజకీయాల వల్ల ఖరారైన ములాయం పేరు స్థానంలో ఐ.కె.గుజ్రాల్ పేరు ఆఖరిలో వచ్చి చేరింది. ఆనాడు 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవగౌడ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సందర్భంలో ఇది జరిగింది. అప్పుడు లోపల,బయట జరిగిన పరిణామాలను ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక మాజీ సంపాదకుడు శేఖర్ గుప్తా 2012 సెప్టెంబర్ నెలలో వివరంగా రాశాడు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటంలో, అలాగే కూటమిలో తలెత్తే ఘర్షణలను సర్దుబాటు చేసి సంక్షోభ నివారణా నిపుణుడిగా పేరొందిన అప్పటి సిపిఎం కేంద్ర కమిటీ కార్యదర్శి హరికిషన్ సూర్జిత్ సింగ్ ను ఎన్.డి.టి.వి. ఇంగ్లీషు ఛానల్ తరపున "వాక్ అండ్ టాక్ " లో ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఈ వివరాలు తనక తెలిసాయని గుప్తా రాశాడు. ములాయం లోహియా సోషలిస్టు సింద్ధాంత వాది అయినా కమ్యూనిస్టు నాయకుడు సూర్జిత్ తో కూడా సన్నిహితంగా ఉండేవాడని, అలాగే అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం ములాయమదని, ములాయం ను ప్రధాని చేయడానికి తాను ప్రయత్నాలు చేసిన సంగతులు, అలాగే పార్టీలో ఆయనకు వచ్చిన మద్దతుతో ములాయం పేరు ఖరారైన తర్వాత కొందరి నిరోధక చర్యలు వల్ల ఆయన ప్రధాని కాలేకపోయారు" అని సూర్జిత్ తనతో జరిగిన సంభాషణల్లో చెప్పారని శేఖర్ గుప్తా రాశాడు.
Nov 23 2024, 09:54